Monday, 22 September 2025

అనన్యా శ్చిన్తయన్తో మాం - గీత 9-22 # చైతన్య భగవద్ గీత #రాజవిద్యారాజగుహ్య యోగము


‘అమ్మా! నా పేరు రంగడు. నేను పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటాను. మీ వారు మా శేఠ్ వద్ద ఈ

సరుకులు తీసుకొని, తొందరగా మీకు ఇచ్చి రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. నేను బయలుదేరడంలో కొంత ఆలస్య మైందని ఆగ్రహించి, అక్కడే ఉన్న ముల్లుకర్రతో నన్ను కొట్టారు. ఆ ముల్లు గీసుకుని రక్తం వచ్చింది. అంతే' అన్నాడు ఆ బాలుడు.

'అయ్యో! ఎంత తొందర అయితే మాత్రం పసిబిడ్డను ఇలా కొట్టడమా? ఉండు నాయనా! కాస్త తుడిచి

మందు వేస్తాను' అని ఆమె లోపలి కెళ్ళింది. ఆమె తిరిగి వచ్చే లోగా బాలుడు తిరోహితు డయ్యాడు.

ఇల్లాలు మూటను విప్పి చూచింది. అందులో కుటుంబము లోని వారందరికి బట్ట లున్నాయి. కొన్ని నగలున్నాయి. కొంత నగదు కూడా ఉంది.

సంచులలో చూస్తే వంట సరుకులు పుష్కలంగా ఉన్నాయి. ఆశ్చర్య పోయిన ఆ తల్లి వెంటనే షడ్రసోపేతమైన పాకం చేయడానికి సిద్ధమై చకచకా చేస్తూ ఉంది. ఈ లోగా దీన వదనుడై ఇంటి వైపు వస్తున్న భర్తను చూచి, పరుగు పరుగున ఆయనను సమీపించింది.

ఆమెను చూడగానే భర్త కన్నీళ్ళను ఆపుకోలేక పోయాడు.

'నా ప్రయత్న మంతా నేను చేశాను. ఎవరిని అడిగినా, ఎంతగా ప్రాధేయ పడినా, ఎవ్వరూ కనికరించ

లేదు. ఆకలితో అలమటిస్తున్న బిడ్డలకు కనీసం గంజైనా త్రాగించ లేని నా  దారిద్ర్యానికి సిగ్గు పడుతున్నాను' అని ఆ భక్తుడు పసిబిడ్డలా రోదించాడు.

భార్య విస్మయం చెందింది. 'అదేమిటి! మీరు పంపిన సరుకులతో నేను వంట కూడా చేస్తూ ఉంటే,

మీరేమిటి అలా మాట్లాడుతారు?' అని ప్రశ్నించింది. 'నేను సరుకులు పంపడమేమిటి?' అని తిరిగి ప్రశ్నించాడు భర్త.

జరిగిన విషయ మంతా ఆమె పూస గుచ్చినట్లు చెప్పింది. బాలుడి వీపుపై ముల్లుగీత వల్ల ఏర్పడిన

గాయాన్ని గూర్చి కూడా చెప్పింది. భక్తుడు నిర్ఘాంత పోయాడు. తీరా వెళ్ళి పూజా మందిరంలో చూస్తే, తాళపత్రంపై ముల్లుగీత లేదు. చిరుగు అసలే లేదు. గ్రంథము మామూలుగా ఉంది.

తన తప్పిదానికి భక్తుడు పరితపించాడు. తీవ్రమైన ఉద్విగ్నతకు లోనయ్యాడు. పాండురంగని దివ్య

దర్శనానికి నోచుకున్న అర్ధాంగి అదృష్టానికి పరవశించి పోయాడు.

'భగవాన్! పాండురంగా! నా అజ్ఞానాన్ని క్షమించు. నీ మాట ఎన్నడూ వృథా కాదు. నీ భక్తుడు ఎప్పుడూ వృథా పోడు. గీతపై ముల్లుతో గీస్తే అది నీ దేహంపై గీసినట్లు అయిందా? నాకు కనువిప్పు కలగడానికి నా చేత నువ్వే అలా చేయించావా? నీ గీతా వాక్యం సత్యం కాదని అనుమానించాను. కాని, గీత నీ దేహమేనని, నీ స్వరూపమే నని గ్రహించలేక పోయాను' అని పశ్చాత్తాపం చెంది, పరమేశ్వరుడు అనుగ్రహించిన నగలను, నగదును పేదలకు పంచిపెట్టి, రెట్టించిన భక్తి శ్రద్ధలతో ఆ భక్తుడు అనన్య భక్త్యారాధనకు పునరంకిత మయ్యాడు.

గీతాశ్రయో_హం తిష్ఠామి గీతామే చోత్తమం గృహమ్ |

గీతా జ్ఞాన ముపాశ్రిత్య త్రీన్లోకా న్పాలయా మ్యహమ్ ||

నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీతయే నాకు వాస మందిరము. గీతా జ్ఞానమును ఆధారం

చేసుకొని నేను ముల్లోకాలను పాలిస్తున్నాను అని వరాహ పురాణంలో భగవానుడు భూదేవికి బోధించాడు.

అనన్య భక్తి అనేది అనేక జన్మల పుణ్యఫల విశేషం. నిరంతరాభ్యాసం వల్ల ప్రాప్తించే భగవదనుగ్రహం. అనన్య భక్తి తత్పరులైన ఏకాంత భక్తుల హృదయాలలో పరమేశ్వరుడు తప్ప మరొకటి ఉండే అవకాశం లేదు. వాళ్ళు కేవలం భగవచ్ఛరణులు. కనుక వారి యోగక్షేమాలను పరమేశ్వరుడే చూసుకుంటాడు. (కేవల మేవ భవచ్చరణాః తే అతః భగవా నేవ తేషాం యోగక్షేమం వహతి ఇతి).

అనన్య భక్తిలో రమించే ఏకాంత భక్తులు భగవంతుని కన్నా అన్యమైన సమస్త విషయాలలో ఉపేక్షా

భావాన్ని కలిగి ఉంటారు. చివరికి బ్రతుకులో గాని, చావులో గాని చెక్కు చెదరని, మొక్కవోని భక్తితోనే

శోభిస్తూ ఉంటారు. (న హి తే జీవితే మరణేవా ఆత్మనః గర్దిం కుర్వన్తి!). పరమేశ్వరుని క్షణం విడిచి జీవించ లేరు. బ్రతుకులో ఏదైనా జరగనీ, బుద్ధిలో భక్తిని మాత్రమే ప్రధానంగా ఉంచుకుంటారు. క్షణక్షణానికి పెంచు కుంటారు.

పల్లవి: నీవు లేక నేను లేను - లేను నిన్ను విడిచి నేను ఉండలేను ॥నీవు ||

చరణము:బ్రతుకు బండలైనా బుద్ధి పండి ఉంది మాధవ మాధవ యనుచు మథన పడుతూ ఉంది

కొన ఊపిరైనా తూలుతూ నీ పాదము చేరు ॥ నీవు ||

అని చైతన్య గీతిక అనన్య భక్తి రాగాన్ని ఆలపించింది.

ఇంతవరకు మనం భక్తి ప్రధానమైన కర్మయోగానుసారము ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పుకున్నాం.

ఇప్పుడు జ్ఞానపరంగా చూద్దాం.

అనన్య చింతనము

అనన్యులు అంటే అన్యంగా ఉండని వారు. పరమాత్మ కన్నా తాము వేరు అని భావించని వారు

అనన్య చేతస్కులు (అనన్యాః అపృథగ్భావాః) పరమాత్మను ఆత్మ స్వరూపంగా దర్శించి ఉపాసించే వారు అని అర్థము. అట్టి వారి యొక్క యోగక్షేమాలను పరమాత్మే వహిస్తాడు. జ్ఞాని పరమాత్మ కన్నా అన్యంగా లేదు కనుక, జ్ఞాని యోగక్షేమాలను స్వయంగా పరమాత్మే చూసుకుంటాడు.

జ్ఞానీ త్వాశైవ మే మతమ్ - 'జ్ఞాని నా ఆత్మయే' అని ఏడవ అధ్యాయం - పద్దెనిమిదవ శ్లోకంలో

భగవంతుడే చెప్పి ఉన్నాడు కదా! అందుచేత జ్ఞాని యొక్క అవసరాలు పరమాత్మ అవసరాలుగా మారుతాయి. కనుక జ్ఞాని యోగక్షేమాలను పరమాత్మే వహిస్తాడు.

అయితే, ఈ సందర్భములో శ్రీ శంకరాచార్య స్వామి భాష్యంలో ఒక ఆసక్తికర మైన విషయాన్ని

వినిపిస్తారు. నను అన్యేషా మపి భక్తానాం యోగక్షేమం వహత్యేవ భగవాన్? మరి, జ్ఞానులు కాని భక్తుల యొక్క అనగా కర్మయోగుల యొక్క యోగక్షేమాలను కూడా భగవంతుడు వహిస్తాడు కదా! నిజమే. అది సత్యం. తప్పక వహిస్తాడు (సత్యం ఏవమ్; వహతి). మరి భక్తుల యోగక్షేమాలను కూడా తానే వహించే టప్పుడు, తన స్వరూపమైన జ్ఞానుల యోగక్షేమాలను చూసుకుంటాడు అని ప్రత్యేకించి చెప్పడంలో విశేష మేమిటి? అనేది శంక. విశేష ముంది. అదేమిటంటే,

అన్య యే భక్తాః తే స్వాత్మార్థం స్వయమపి యోగక్షేమం ఈహస్తే అనన్య దర్శినః తు న ఆత్మార్ధం యోగక్షేమం ఈహన్తో- భక్తులు తమ యోగక్షేమాలకై తాము ప్రయత్నం చేసుకుంటూనే, పరమేశ్వరుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అనన్య దర్శులైన జ్ఞానులు తమ యోగక్షేమాలను తాము పట్టించుకోరు. అంతటా ఉపేక్షా భావంతో ఉంటారు. ఇదే ఇద్దరి మధ్య భేదము. ఈ శ్లోక వ్యాఖ్యానంలో మనం చెప్పుకున్న పండరీ భక్తుడు కూడా భార్య సలహా మేరకు ఊళ్ళో కెళ్ళి తన ప్రయత్న మేదో తాను చేశాడు కదా! అదే జ్ఞాని అయితే చేయడు. పూర్ణ విశ్వాసంతో పరమేశ్వరుని యందే బుద్ధిని నిలిపి ఉంచుతాడు. అదే విశేషము.

శివో భూత్వా శివం భజేత్ - శివుడవై శివుణ్ణి ఆరాధించు అన్నట్లుగా, జ్ఞానులు తమ ఆత్మే పరమాత్మ

అనే బ్రహ్మాత్మ జ్ఞానంతో పరమాత్మను ఉపాసిస్తూ ఉంటారు కనుక, వారి యోగక్షేమాలను పరమాత్మే వహిస్తూ ఉంటాడు.

అన్యమైన విషయాల నుండి దూరంగా పోవాలని ప్రయత్నించే వారు కర్మయోగులు, లేదా భక్తులు. తమలో అన్యమైన విషయాలే లేకుండా చేసుకొనే వారు జ్ఞానులు.


అనన్యా శ్చిన్తయన్తో మాం - గీత 9-22 # చైతన్య భగవద్ గీత #రాజవిద్యారాజగుహ్య యోగము

‘అమ్మా! నా పేరు రంగడు. నేను పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటాను. మీ వారు మా శేఠ్ వద్ద ఈ సరుకులు తీసుకొని, తొందరగా మీకు ఇచ్చి రమ్మని నన్ను ఆజ్ఞాపి...