ఆప్తవాక్యం
నాకు తెలుసు…నేను తెలుసుకోవాలి.
భగవాన్!
నీవు నాలో ఉన్నావని
నా చుట్టూ ఉన్నావని
నా వెనుక ఉన్నావని
నా ముందు ఉన్నావని
నన్ను తెలుసుకొంటూ ఉన్నావని
నాకు తెలుసు.
కాని
నన్ను సుఖపెట్టమని
నాకు ఆనందాన్ని పంచమని
అన్యుల వైపు చూస్తున్నానంటే
నాకు ఏమి తెలిసినట్లు? ఏమీ లేదు.
అందుకే నేను తెలుసుకోవాలి.
భగవాన్!
దర్శింప దగిన వాడివి నీవేనని
అర్చింపదగిన వాడివి నీవేనని
స్తుతింపదగిన వాడివి నీవేనని
ధ్యానింపదగిన వాడివి నీవేనని
నాకు తెలుసు.
కాని,
నీకు అతి సమీపంగా నేను చేరిపోవాలని
నీవుగా నేను మారిపోవాలని
అహరహం అభిలషించే నేను
నిన్ను దృశ్యంగా దర్శించాలని
దర్శించి తరించాలని భావిస్తున్నానంటే
నాకేమి తెలిసినట్లు?
అందుకే నేను తెలుసుకోవాలి.
భగవాన్!
అంతట ఉన్నది నీవేనని
అన్నిటిలో ఉన్నది నీవేనని
అందరిలో ఉన్నది నీవేనని
ఎప్పుడూ ఉన్నది నీవేనని
నాకు తెలుసు.
కాని
అవి కావాలి - ఇవి పోవాలి
అవి రాకూడదు - ఇవి పోకూడదు.
అంటున్నానంటే నాకేమి తెలిసినట్లు?
అందుకే నేను తెలుసుకోవాలి.
భగవాన్!
బరువులు బాధించినా
బాధలు పీడించినా
ప్రారబ్ధం పిండుతున్నా
హృదయం ఎండుతున్నా
నీ వీక్షణం ఒక్క క్షణం నాపై పడితే
మరుక్షణం అవన్నీ ఆవిరై పోతాయని
నాకు తెలుసు.
కాని,
క్షణంలో అంతరించే అవకాశం ఉన్నా.
అవగాహన కొరవై జన్మలు దొర్లించుకుంటున్నాను.
నాకు ఏమి తెలిసిందని?
అందుకే నేను తెలుసుకోవాలి.
భగవాన్!
నీ శక్తి అపారమని
నీ యుక్తి అనంతమని
నీ దక్షత అద్భుతమని
నీ పాలన అసమానమని
నాకు తెలుసు.
నాకు శక్తి వివ్వమని
యుక్తిని అనుగ్రహించమని
నిన్ను ప్రార్థిస్తున్నా.
నీవు ఇచ్చే శక్తిని పుచ్చుకొని
నీవు ఉన్నావనే ధైర్యం తెచ్చుకొని
నేనే ఏదేదో చెయ్యాలని భావిస్తున్నానని.
వాకు తెలుసు.
కాని
నీ శక్తి ముందు నేను నిరుపయోగమని
నీ యుక్తి ముందు నేను నిష్ప్రయోజనమనే
వాస్తవాన్ని గ్రహించి
మనస్సును నిగ్రహించి
చేతులు దులుపుకొని
చిత్తాన్ని నిలుపుకొని
హృదయాన్ని నీ అడుగుల కడ పడేస్తే
నన్ను మించిన శక్తిపరులు ఎవరుంటారు?
ఇది నాకు తెలిసిందా?
అందుకే నేను తెలుసుకోవాలి.
నిన్ను నాకు ఇచ్చుకొనేందుకు
నేనుగా నీవు వెలిగేందుకు
నీవు నిరీక్షిస్తున్నావని
నాకు నేనుగా తెలుసుకోవాలి.
నీ పాదాలపై వాలి
నన్ను నేను తెలుసుకోవాలి.
ఓం …ఓం ..ఓం …
స్వామి సుందర చైతన్యానంద
No comments:
Post a Comment