Thursday, 19 June 2025
నవ్వుకు నాంది
Saturday, 14 June 2025
ఆప్తవాక్యం నాకు తెలుసు…నేను తెలుసుకోవాలి.
ఆప్తవాక్యం
నాకు తెలుసు…నేను తెలుసుకోవాలి.
భగవాన్!
నీవు నాలో ఉన్నావని
నా చుట్టూ ఉన్నావని
నా వెనుక ఉన్నావని
నా ముందు ఉన్నావని
నన్ను తెలుసుకొంటూ ఉన్నావని
నాకు తెలుసు.
కాని
నన్ను సుఖపెట్టమని
నాకు ఆనందాన్ని పంచమని
అన్యుల వైపు చూస్తున్నానంటే
నాకు ఏమి తెలిసినట్లు? ఏమీ లేదు.
అందుకే నేను తెలుసుకోవాలి.
భగవాన్!
దర్శింప దగిన వాడివి నీవేనని
అర్చింపదగిన వాడివి నీవేనని
స్తుతింపదగిన వాడివి నీవేనని
ధ్యానింపదగిన వాడివి నీవేనని
నాకు తెలుసు.
కాని,
నీకు అతి సమీపంగా నేను చేరిపోవాలని
నీవుగా నేను మారిపోవాలని
అహరహం అభిలషించే నేను
నిన్ను దృశ్యంగా దర్శించాలని
దర్శించి తరించాలని భావిస్తున్నానంటే
నాకేమి తెలిసినట్లు?
అందుకే నేను తెలుసుకోవాలి.
భగవాన్!
అంతట ఉన్నది నీవేనని
అన్నిటిలో ఉన్నది నీవేనని
అందరిలో ఉన్నది నీవేనని
ఎప్పుడూ ఉన్నది నీవేనని
నాకు తెలుసు.
కాని
అవి కావాలి - ఇవి పోవాలి
అవి రాకూడదు - ఇవి పోకూడదు.
అంటున్నానంటే నాకేమి తెలిసినట్లు?
అందుకే నేను తెలుసుకోవాలి.
భగవాన్!
బరువులు బాధించినా
బాధలు పీడించినా
ప్రారబ్ధం పిండుతున్నా
హృదయం ఎండుతున్నా
నీ వీక్షణం ఒక్క క్షణం నాపై పడితే
మరుక్షణం అవన్నీ ఆవిరై పోతాయని
నాకు తెలుసు.
కాని,
క్షణంలో అంతరించే అవకాశం ఉన్నా.
అవగాహన కొరవై జన్మలు దొర్లించుకుంటున్నాను.
నాకు ఏమి తెలిసిందని?
అందుకే నేను తెలుసుకోవాలి.
భగవాన్!
నీ శక్తి అపారమని
నీ యుక్తి అనంతమని
నీ దక్షత అద్భుతమని
నీ పాలన అసమానమని
నాకు తెలుసు.
నాకు శక్తి వివ్వమని
యుక్తిని అనుగ్రహించమని
నిన్ను ప్రార్థిస్తున్నా.
నీవు ఇచ్చే శక్తిని పుచ్చుకొని
నీవు ఉన్నావనే ధైర్యం తెచ్చుకొని
నేనే ఏదేదో చెయ్యాలని భావిస్తున్నానని.
వాకు తెలుసు.
కాని
నీ శక్తి ముందు నేను నిరుపయోగమని
నీ యుక్తి ముందు నేను నిష్ప్రయోజనమనే
వాస్తవాన్ని గ్రహించి
మనస్సును నిగ్రహించి
చేతులు దులుపుకొని
చిత్తాన్ని నిలుపుకొని
హృదయాన్ని నీ అడుగుల కడ పడేస్తే
నన్ను మించిన శక్తిపరులు ఎవరుంటారు?
ఇది నాకు తెలిసిందా?
అందుకే నేను తెలుసుకోవాలి.
నిన్ను నాకు ఇచ్చుకొనేందుకు
నేనుగా నీవు వెలిగేందుకు
నీవు నిరీక్షిస్తున్నావని
నాకు నేనుగా తెలుసుకోవాలి.
నీ పాదాలపై వాలి
నన్ను నేను తెలుసుకోవాలి.
ఓం …ఓం ..ఓం …
స్వామి సుందర చైతన్యానంద
Sunday, 8 June 2025
ఎంత గొప్పగా రాసినారె! నమస్తే తెలంగాణ జిందగీ ఆదివారం | 8 జూన్ 2025
ఎంత గొప్పగా రాసినారె!
నమస్తే తెలంగాణ జిందగీ ఆదివారం | 8 జూన్ 2025
ఈ నెల 12న సినారె వర్ధంతి పద్యం కట్టి.. కవితలు రాసి.. గేయాలు దాటి.. గజల్స్ మీటి.. ఖండికలు సృజించి.. కావ్యాలు అల్లిన సవ్యసాచి మన తెలంగాణ ముద్దుబిడ్డ, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన అక్షరతూలికలోంచి ఒలికిన సిరా చుక్కలు.. తెలుగు వాఙ్మయానికి ఆస్తులయ్యాయి. సాహిత్య వనంలో యథేచ్ఛగా విహరించిన ఈ కవికోకిల సినీవాకిటా అంతే స్వేచ్ఛగా పాటలల్లింది. ఆయన ఏది రాసినా.. మన సినారె ఎంత గొప్పగా రాసినారే అనుకోవడమే పాఠకుల వంతైంది. తన అక్షర గవాక్షాలను తెరిచి అందరికీ విశ్వంభరను చూపినసాహితీదీప్తి సినారె కొండంత సినీ పాట' గురించి గోరంత ప్రస్తావించుకునే ప్రయత్నం ఇది..
“కలల అలలపై తేలెను...మనసు మల్లె పూవై .. గులేబకావళి కథ సినిమా కోసం సినారె రాసిన మొట్టమొదటి పాట. రికార్డయిన మొదటి పాట "నన్ను దోచుకొందువటే.."! కలల అలలపై పాట రెండో పంక్తి.. 'ఎగిసిపోదునో చెలియా.. నీవే ఇక నేనై..” అన్నారు కవి. అన్నట్టుగానే.. తెలుగు సినిమాల్లో ఈ పాటతో సినారె శకం మొదలైంది. తన మొదటి చిత్రంలో అన్ని పాటలూ తనకు రాసే అవకాశం ఇస్తే గానీ, సినిమా కవిగా ప్రస్థానం మొదలుపెట్టనున్నారట సినారె. ఆ అవకాశం ఎన్టీఆర్ ఇచ్చారు. ఇంకేముంది?! గులేబకావళి కథలో పదికి పదిపాటలు ఆయనే రాశారు. అన్నీ హిట్టే!! గులేబకావళి కథ నుంచి ఆరుంధతి చిత్రంలోని "జేజమ్మ మాయమ్మ" వరకు ఎన్నెన్నో పాటలు ప్రజల జేజేలు అందుకున్నాయి. జేజేలు అనగానే.. "జోలా జోలమ్మ జోలా జేజేలా జోలా- సూత్రధారులు' పాట రాసింది మన సినారెనే! ఈ పాటను కొంటె మరదలితో పాడించి పెంకి బావను నిద్రపుచ్చిన ఈ కవిశ్రేష్ఠుడు.. చిట్టి చిన్నారులకు అమ్మ ప్రేమంత ఆప్యాయమైన లాలిపాటనూ అనుగ్రహించారు. అన్నమయ్య 'జో అచ్యుతానంద.. తర్వాత అంతటి జోలపాటగా చంటిపాపలకు చదివించారు. 'వటపత్ర శాయికి వరహాల లాలి..' పాటను కీర్తన అనడానికి సందేహం అక్కర్లేదు. ఈ లాలిపాట మొదటి చరణంలో పురాణ పురుషులను, వారి మాతృమూర్తులను ప్రస్తావించారు. రెండో చరణంలో దేవదేవుణ్ని కీర్తించిన వాగ్గేయకారులను స్మరించాడు. తన లాలిపాటతో అమ్మలందరికీ దగ్గరైన సినారె.. అమ్మంటే ఏంటో ఎన్నో పాటల్లో తెలియపరిచాడు. "అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి..' అంటూ అన్న గొప్పదనాన్ని మరో పాటలో వివరించారు. సినారె పాటలు నవపారిజాతాలు. రసరమ్య గీతాలు. లలిత రమణీయాలు, పదాలతో విన్యాసాలు చేయడమే కాదు.. తను ప్రయోగించిన ప్రతి పదానికీ సమర్థమైన భావం ప్రకటించగలగడం ఆయన ప్రత్యేకత. ఇందుకు ఉదాహరణే పూజాఫలము సినిమాలోని 'పగలే వెన్నెల.. జగమే ఊయల..!! జానకమ్మ ఎంత కమ్మగా పాడితే మాత్రం పగలే వెన్నెల ఎందుకొస్తుంది? ఏ ఎందుకు రాకూడదు.. కదలే ఊహలకే కన్నులుంటే..” అంటూ పాట రెండో పంక్తిలో సినారె ప్రయోగం చేశాక.. పగలేంటి? నిండు అమావాస్య నాడు కూడా పండు వెన్నెల కురవకుండా ఉంటుందా?! ఇలాంటి భావాలు పొంగించడానికి మస్తిష్కంలో పాండిత్యం ఒక్కటుంటే సరిపోదు! | మనసు పొరల్లో మధురానుభూతుల భావుకత వాహినిలా ప్రవహించాలి. 'ఏకవీర' సినారె కలం బలాన్ని తెలియజేసిన మరో చిత్రం. దీనికి కొన్ని పాటలు, అన్ని మాటలు ఆయనే అందించారు. ఈ సినిమా కోసం ఆయనరాసిన ఖండికలు సినీజనాలనే కాదు.. పండితులనూ అలరించాయి. 'ఏ పారిజాతము లియ్యగలనో సఖీ.. గిరి మల్లికలు తప్ప గరిక పువ్వులు తప్ప... అపురూపం. ఇందులోనిదే 'తోటలో నా రాజు తొంగి చూసెను నాడు..' ఈ పాటంతా రవ్వంత సడి లేకుండా రసరమ్యంగా సాగిపోతుంది. ఏకవీర విడుదలైన తర్వాత ఈ పాటను రాసింది భావకవి దేవులపల్లి అనుకొని, ఆయనకు ఉత్తరాలు కూడా రాశారట. తెలుగు సినిమాల్లో రాణించిన తెలంగాణ కవి దాశరథి... తన అగ్రజుడని చెప్పే సినారె, దేవులపల్లిని గురుతుల్యుడిగా భావించేవారు. తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవం కట్టబెట్టిన అరుదైన గీత రచయితల్లో సినారె ఒకరు. లలిత గీతాలెన్నో రాశారు. దీర్ఘ సమాసాలతో నిండిన పాటలూ రాశారు. కొన్ని హిట్స్
• మబ్బులో ఏముంది... నా మనసులో.... •చెలికాడు నిన్నే రమ్మని పిలువా..
•ఈ రేయి తీయనిది. •నా మది నిన్ను పిలిచింది •శారద నను చేరగా
•గున్నమామిడి కొమ్మ మీద • సిపాయి సిపాయి •శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు
•ఏ దేశమేగినా ఎందు కాలిడినా •సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా
•చాంగురే బంగారు రాజా.. •వస్తాడు నా రాజు ఈ రోజు..
ఏ పంథా ఎంచుకున్నా.. దర్శకుడు చెప్పిన సన్నివేశాన్ని పదింతలు చేసేవారు. అనువాద చిత్రానికి పదునైన భావాన్ని స్వేచ్ఛగా తొడిగేవారు. 'కర్ణ' చిత్రంలో 'గాలికి కులమేది.. ఏదీ
నేలకు కులమేది...' పాటలో 'పాలకు ఒకటే తెలివర్ణం.. ఏదీ ప్రతిభకు కలదా స్థలభేదం' పంక్తులు
కవి నారాయణ రెడ్డి సామాజిక స్పృహకు అద్దం పడుతుంది. కర్ణుడు అనగానే మన తెలుగు కౌంతేయుడు 'దానవీరశూర కర్ణ' గుర్తుకురాకుండా ఉండదు. ఈ సినిమాలో దర్శక నిర్మాత ఎన్టీఆర్కు దుర్యోధనుడికి డ్యూయెట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అందరికీ చిత్రం అనిపించింది. కవి నారాయణరెడ్డికీ విచిత్రంగా తోచింది. ఆ రెండు పదాలే. పాటకు మకుటం అయ్యాయి. 'బింబాధర మధురిమలూ... బిగి కౌగిలి ఘుమఘుమలతో' సాగిపోయిన ఆ యుగళ గీతం 'భళారే విచిత్రం.. అయ్యారే విచిత్రం' అనిపించుకుంది. పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో మాత్రమే కాదు..సాంఘిక చిత్రాల్లోనూ సంస్కృత దీర్ఘ సమాస గీతాలు రాశారు సినారె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'చెల్లెలి కాపురం'లో 'అడవే మయూరి... ఆ కోవకు చెందినదే! 'చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన..” అంటూ మొదలయ్యే ఆ గీతం మనోలతిక ఊగిపోయేంత ఉత్సాహంగా పల్లవిస్తుంది. సహస్ర ఫణి సంచలిత భూకృతుల' ప్రయోగానికి అర్ధం తెలియకుండానే ఫణుల్లా తలలూపారు శ్రోతలు, వెయ్యి పడగల శేషుడు బుసకొట్టడం అన్నఅర్ధాన్ని పకడ్బందీగా ప్రయోగించారు మన కవి. 'తూర్పు పడమర' సినిమా కోసం 'శివరంజనీ నవరాగిణి...'గీతంలోనూ సినారె మార్క్ కనిపిస్తుంది. పిల్లయేరులా మొదలయ్యే ఈ గీతం రెండో చరణం అఖండ గోదారి ఉద్భతిగా సాగిపోతుంది. ఇక సినారె పూర్తి సంస్కృత సమాసాలతో ఆవిష్కరించిన గీతం "స్వాతికిరణం'లోని 'సంగీత సాహిత్య సమలంకృతే'. ఇందులో 'వేదవేదాంత వనవాసిని పూర్ణశశి హాసిని నాదనాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి.. వ్యాసవాల్మీకి వాగ్దాయిని' పంక్తులు జ్ఞాన సరస్వతికి ఈ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చెల్లించిన కైమోడ్పుల్లా వినిపిస్తాయి. నారాయణరెడ్డి పాటలు కర్పూర కళిళలు. 'నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో' పాటలో ప్రకృతి పరవశింపజేసిన తీరు.. ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎవరూ ఎందుకు రాయలేదనిపిస్తుంది. 'అమ్మనుమించి దైవమున్నదా..! అమ్మ గురించి ఇంత కన్నాగొప్ప పాట ఉన్నదంటే నమ్మబుద్ధి కాదు. "స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహితుల పాలిట భగవద్గీతం. 'నీరాజనం'లోని 'నినుచూడక నేనుండలేను..” ఆ రోజుల్లో ప్రేమపక్షులకు కంఠోపాఠం. "కనులు పలుకరించెను.. పెదవులు పులకించెను.. బుగ్గలపై లేత లేత సిగ్గులు చివురించెను..బుగ్గకు సిగ్గును అంటగట్టిన తొలి ప్రయోగంగా ఈ పాటను చెబుతారు. సినారె రాసిన మూడున్నర వేల పాటల్లో ఎన్నని ఎంచుకోగలం, ఎంతని చెప్పుకోగలం. తెలుగు భాషా గరిమను చాటిన ఆయన సాహితీ సంపదకు ఏ మాత్రం తీసిపోవు సినారె సినీగీతాలు కూడా! 'ఈ స్థాయికి తక్కువగా నేను రాయను' అని దర్శక నిర్మాతలకు నిర్మొహమాటంగా చెప్పి... మన పాట స్థాయిని ఆకాశమంత పెంచారు. రకరకాల సాహితీ ప్రక్రియల్లో తనదైన ముద్ర వేసినా.. పాటలు, గేయాలు రాయడమే తనకు ఇష్టమంటారు. 'ఎన్ని తెన్నుల కైత కన్నె విహరించిననూ పాటలోనే నాదు ప్రాణాలు గలవందు' అని ఆత్మీయంగా ప్రకటించుకున్న తెలంగాణ కవితా సిరి
సింగిరెడ్డి నారాయణరెడ్డికి నమస్సుమాంజలులు.
** కణ్వస
నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807
నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807 తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. 19...
-
I have updated(26-04-2012)the folder: except MBK – 75 Raga Vaibhavam – Vol 04.part2.rar this link is not working presently if anyone has the...
-
నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807 తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. 19...
-
మానవాభ్యున్నతికి సహృదయత కావాలి. సదస్సులు కావు. భారతీయ హృదయం పాశ్చాత్య మేధస్సును స్పృశించాలి. అప్పుడే యుద్ధాలు అదృశ్యమవుతాయి. శాంతి నెలకొంటుం...