కవుల గళం - దోపిడికి కళ్లెం
గోదావరి కన్ను పొడువకండి
ధర్మానికి దారులెక్కడివి
న్యాయానికి చూపెక్కడిది
ఆది నుండి వక్రగీతాలే
ఆస్తులు అంతస్తులు అధికారాలు కబళించినట్లే
దోపిడికి ప్రతినిధులు
నీళ్లను దోచుకున్నారు
మళ్లీ ఇప్పుడు
గోదావరిపై పాత పాటలే రోత మాటలే
కుట్రలకు ఎర్రతివాచీలు
మా పొయ్యి మేము పెట్టుకున్నా
మా గిన్నెల్లో ఎసరుకు మిమ్మల్నే నీళ్లడగాలా?
ఇక్కడ చెరువులు, కుంటలు
పొలాలు పక్షులు ఆకలి గీతాలు పాడాలా?
నవీన యుగంలో కూడా
అన్యాయాన్ని పరిష్కరించే ట్రిబ్యునల్
చట్టాలెవరి కాళ్లకు ప్రణమిల్లాయో? ఎవరికెరుక
అరటాకుల గోస అరటిదే
మామిడి ఆకుల గోస మామిడిదే
తల్లి కడుపులో తలపెట్టి చూస్తే తెలుస్తది
అమ్మ వ్యధ
గోదావరిని మళ్లించుకునే తాపత్రయాలు
ఏ బడిలో చదువుకున్నా గురువెవరైనా
చదివించింది మన అమ్మనే
చర్చల్లేపు చర్చించుకోవడాలు లేవు
ఎవరి దయా దానాలక్కరలేదు
కాళ్లు దారి తప్పినా
మనసు మనింటి కడప మీదనే ఉండాలి
మనసు మతి తప్పినా ఎద ఇంట్లోనే ఉండాలి
తరతరాల కరువు తండ్లాట
అస్తిత్వ ఆవేదన
మా కన్నీళ్లను వేన్నీళ్ళుగా మార్చుకునే బరితెగింపు
మా నీళ్లు మాకే మీ నీళ్లు మీకే
పొలాల కాళ్లు తడవాలి
పక్షుల ముక్కులద్దాలి
పశువుల తోకలు నీళ్లల్ల లొట్కుగొట్టాలి
ఒక్కటీ భరోసా లేదు
రెండేండ్ల కాలంలో నీళ్లాదెరువు
నిప్పులు మీద పోసుకున్నట్టే
నాయనలారా!
నాలుకలెన్ని మడతలైనా తిప్పండి
నీళ్లు నిలబడే ఆలోచనలకు తలుపులు తెరువండి
వలసలకు నెలవీయకండి
నీళ్లే బతుకు జలదారలు
గోదావరి కన్ను పొడువకండి
పొలాల పొట్ట కొట్టకండి
బ్రతుకు పాటలకు డప్పులు సరిచేయండి...
వనపట్ల సుబ్బయ్య
94927 65358
No comments:
Post a Comment