Wednesday, 1 October 2025

పరిత్రాణాయ సాధూనాం

 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |

ధర్మ సంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే ||11||

భావము : సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించడానికి ప్రతి యుగంలో నేను పుడుతూ ఉంటాను.

వ్యాఖ్య

పని లేకుండా ప్రపంచాని కెవ్వరూ రారు. ఈ విషయంలో భగవంతుడు కూడా విలక్షణంగా లేడు.

సూర్యుడు ఉదయిస్తాడు. తెల్లవారుతుంది. ఆ తరువాత, తాను చేయవలసింది చేసి సూర్యుడు అస్తమిస్తాడు. వానొస్తుంది. భూమి తడుస్తుంది. గుంటలు నిండుతాయి. నదులు పొంగుతాయి. చెట్లు చిగురిస్తాయి. పంటలు పండుతాయి. ప్రయోజనం లేకుండా ఏ పనులు సాగవు. కాకపోతే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి, ఎవరి బ్రతుకుల్ని వాళ్ళు చక్క బరచుకోవడానికి వస్తారు. కాని, భగవంతుని అవతారం మాత్రం అందరి బ్రతుకుల్ని చక్క చేయడానికి వస్తుంది.

మర్త్యావతార స్విహ మర్త్యశిక్షణమ్

మానవ సమాజానికి శిక్షణ నిచ్చి రక్షించడానికే నిరాకారుడు నరాకారుడై అవతరిస్తాడు అన్నది.

శ్రీమద్భాగవతం, రక్షణ అందరికీ కావాలి. కనుక, శిక్షణ అందరికీ అందాలి. కాకపోతే, శిక్షణా పద్ధతులు

భిన్నంగా ఉంటాయి. శిక్షణను అందుకునే వారి ప్రవర్తనలలోని, ప్రవృత్తులలోని వ్యత్యాసాలే అందుకు

కారణము. కొట్టినా, పెట్టినా తల్లి చేతుల వెనుక ప్రేమే ఉంటుంది. అట్లు తినిపించినా, తిట్లు వినిపించినా తల్లి హృదయంలో వాత్సల్యం ఉంటుందే గాని వైషమ్యం ఉండదు.

లాలనే తాడనే మాతుః న వైషమ్యం యథార్భకే! తద్వదేవ మహేశస్య నియన్తు ర్గుణ దోషయోః

లాలించినా, దండించినా తల్లికి బిడ్డ విషయంలో ఎలాగైతే వైషమ్యం లేదో, అలాగే సర్వ నియామకు

డైన పరమేశ్వరునికి ప్రజల విషయంలో నిర్ణయ ఉండదు.

అవ్యక్తం వ్యక్తం

అవ్యక్తంగా అనంతుడైన భగవంతుడు వ్యక్తం కావడమే అవతారము. భగవంతుని అవతారములో

అనంతమైన కారుణ్యమే ప్రధానంగా గోచరిస్తుంది. ఒక్క విషయాన్ని అర్థం చేసుకుందాం. మన శరీరంలో భగవంతుడు లేని దెక్కడ? అలాగని అన్ని చోట్ల ధ్యానించ గలమా? హృదయంలోనే ధ్యానిస్తాం. ధ్యానానికి హృదయం ఉపలబ్ధి స్థానం. హృదయంలో ధ్యానం సాగుతుంది. హృదయం లోనే దైవదర్శన మవుతుంది. అంతమాత్రాన పరమేశ్వరుడు దేహంలో హృదయానికే పరిమితం అని భావించ గలమా? అంతే. దేహమంతా నియతి రూపంలో శోభిస్తున్న పరమేశ్వరుని, హృదయంలో ధ్యానించిన వారికి హృదయంలో దర్శన మిస్తాడు. అదే ఆయన కారుణ్యం.

విశ్వంలో ఈశ్వరుడు లేని దెక్కడ? విశ్వమంతా తానే నిండి నిబిడీకృతమై ఉన్నాడు. బ్రహ్మ ఏవ

ఇదం విశ్వం. ఈ విశ్వమంతా బ్రహ్మమే. వివిధ ప్రత్యయ గమ్యంగా రూప శబ్దాదులతో విశ్వం గోచరిస్తూ ఉంటే, దేనికీ దూరం కాకుండా, దేనికీ అంటకుండా అభిన్న నిమిత్త ఉపాదాన కారణమైన భగవంతుడు విశ్వానికి విలక్షణంగా శోభిస్తున్నాడు. అలాంటి దివ్యాత్ముడ్ని కళ్ళు దర్శించ గలవా? దర్శించ లేవు. కనుక, బుద్ధితో చూడాలి. అవ్యక్తు డైన పరమాత్మ జ్ఞానరూపంలో బుద్ధికి అందుతాడు. తానే వ్యక్త మైతే కళ్ళకు కూడా కనిపిస్తాడు.

ధర్మ రూపంలో అవ్యక్తంగా శోభించు వాడు, దివ్యదేహధారిగా వ్యక్తమై ప్రకాశించడమే అవతారము.

ఎవరు అవతరించినా, ఏది అవతరించినా వచ్చిన పనిని చక్క పెట్టుకొని వెళ్ళేందుకేనని ఇంతకు

ముందే తెలుసుకున్నాం. మరి, భగవంతుడు అవతరించి నపుడు ఏయే కార్యాలు జరుగుతాయి? ఏయే ప్రయోజనాలు సిద్ధిస్తాయి?

పని ఒక్కటే ఫలితాలు మూడు

భగవంతుడు అవతరించడం అనే ఒక్క అద్భుత కార్యానికి మూడు ప్రయోజనాలు దివ్యంగా సిద్ధిస్తాయి.

అవి (1) సాధు పరిరక్షణము (2) పాప వినాశము (3) ధర్మ సంస్థాపనము.

అవతారము అందించే ఫలితాలు మూడుగా తెలుస్తున్నా, ఈ మూడింటిలో ఏ ఒక్కటి సిద్దించినా,

మిగిలిన రెండూ సిద్దించినట్లే. ఈ సత్యాన్ని చివర అర్థం చేసుకుంటాం. ముందుగా ప్రయోజన క్రమాన్ని వంట పట్టించుకుందాం.

(1) సాధు పరిరక్షణము

సాధుః అంటే మంచివాడు (సజ్జనః) సన్మార్గములో చరించే వాడు సాధువు, లేదా సజ్జనుడు. అలాంటి వారిని పరిరక్షించడం అవతార ప్రయోజనాలలో మొదటిది. సన్మార్గంలో చరించేవారు సాధువులు కనుక, అలాంటి సాధువులను పరిరక్షించడమే సాధు పరిరక్షణము (సాధూనాం సన్మార్గస్థానం. పరిత్రాణాయ పరిరక్షణాయ)

సన్మార్గంలో ప్రవర్తించే వాళ్ళు సాధువులు, అయితే ఏది సన్మార్గము? ఎవరి మార్గము వారికి సన్మార్గముగానే కనిపిస్తుంది. లేకపోతే, ఇన్ని మతాలు ఎలా పుట్టుకొచ్చాయి? సన్మార్గము అంటే ధర్మమార్గము. ఏది ధర్మమార్గము? ఒకొక్క కాలానికి ఒకొక్క ధర్మము, ఒకొక్క దేశానికి ఒకొక్క ధర్మము, ధర్మనిర్ణయం ఇదమిత్థంగా తేలే విషయ మేనా? ఇదంతా వ్యావహారిక ధర్మము, ఇక్కడ ధర్మము అంటే, న్యాయము లేదా నియతి అని అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో నియతి ఉంది. అదే ఇక్కడ ధర్మం. ధర్మరూపంలో ఉన్నది దైవమే. ధర్మమార్గంలో ప్రవర్తించడము అంటే దైవమార్గంలో సయనించడ మని అర్థము. నియతిని అనుసరిస్తూ జీవించేవాడు సాధువు (న్యాయవర్తీ

సాధు  ). కనుక సాధువులు అంటే సన్యాసులు అని కాదు. ధర్మజీవనం సాగించే వారు అని అర్థము. సన్యాసులు ధర్మజీవనాన్ని సాగిస్తారు. కాని, ధర్మజీవనంలో ప్రయాణం చేసే వాళ్ళందరూ సన్యాసులు కానవసరం లేదు.

మరి, న్యాయవర్తులైన సాధుజనులు ధర్మమార్గాన చరిస్తూనే ఉంటారు కదా! అలాంటి వారిని పరిరక్షించవలసిన అవసరం ఏమిటి? వారికి మార్గంలో రక్షణ కరువై ఉండాలి. భద్రత లోపించి ఉండాలి. సాధువుల అభద్రతకు ఎవరు కారణమై ఉంటారు? సాధువులకు అభద్రతను, అవరోధాలను కలిగించేవారు అసాధువులై ఉండాలి. పాపాత్ములై ఉండాలి. సాధువులను పరిరక్షించే పవిత్రకార్యంలో పాపులను నిర్మూలించ వలసిన అవసరం ఉంది కనుక, ఇది అవతార వైభవంలో ప్రాప్తించే రెండవ ప్రయోజనము, దుష్కృతులైన పాపాత్ములయొక్క (పాపకారిణాం) వినాశము (వినాశాయ) అవతారము యొక్క రెండవ కార్యము..

పాప వినాశము

పాపకార్యాలు ఆచరించే వాళ్ళను నశింప చేయడమంటే పాపాన్ని నశింప చేయడమని అర్థము.

నశింపబడేది పాపికాదు. పాపము. సాధు పరిరక్షణము ఎంత అవసరమో, పాపి వినాశము కూడా అంతే అవసరము. ధర్మమార్గంలో అవరోధంగా మారిన పాపులను తొలగించక పోతే, సాధుజీవనము ముందుకు సాగదు. సాధుజీవనం కుంటుపడితే, సమాజం కుదుట పడదు. సమాజ అభ్యుదయం సాధుజీవనంపై ఆధారపడి ఉంది కనుక, సాధుజీవనానికి ఆటంకంగా తయారైన పాపుల్ని ఏరి వేయాలి. తీసి దూరంగా పారేయాలి.

దేహంలో ఒక అవయవం కుళ్ళిపోతే, ఆ దుష్టాంగాన్ని వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగిస్తారు. అలా

చేస్తేనే, వ్యక్తి బ్రతుకుతాడు, ఒకవేళ దుష్టాంగాన్ని తొలగించకుండా, అలాగే ఉంచితే దేహమంతా కుళ్ళిపోయే ప్రమాదం, తద్వారా మరణ ప్రాప్తి కలుగ వచ్చు. కనుకనే, వైద్యుడు దుష్టాంగాన్ని నిర్మూలించినట్లు, నారాయణుడు వైద్యుని పాత్రను పోషించి, సమాజం లోని పాపాన్ని నిర్మూలించి అభ్యుదయాన్ని ఆరోగ్యప్రదంగా ఉంచుతాడు. అట్టి సమాజంలో ధర్మం శోభిస్తుంది. ధర్మజీవనం దివ్యంగా ప్రకాశిస్తుంది.

ధర్మ సంస్థాపనము

ధర్మమును చక్కగా స్థాపించడమే ధర్మ సంస్థాపనము (ధర్మస్య సమ్యక్ స్థాపనం), ధర్మమును

స్థాపించడము అంటే ధర్మమును స్థిరీకరింప చేయడము లేదా రక్షించడము అని అర్థము. ధర్మమును రక్షించడము అంటే, ధర్మమును ఆచరించే ధర్మాత్ములను రక్షించడము అని భావము. ధర్మాత్ములను రక్షించడము అంటే, ధర్మాత్ముల ధర్మజీవనాన్ని ఆటంకపరచే అధర్మపరులను శిక్షించడమని అర్థము. అధర్మపరులే పాపులు. వారు ధర్మమును అనుష్టించరు. పైగా అధర్మములో చరిస్తారు. వారు అధర్మములో చరించడమే గాక ధర్మమార్గాన చరించే వారికి అవరోధంగా తయారవుతారు. కనుకనే ధర్మ సంస్థాపనము అనే పవిత్ర కార్యంలో శిష్ట రక్షణముతో పాటు దుష్టశిక్షణము కూడా జరుగుతుంది. ఇదంతా అవతార కార్యము.

ధర్మరూపంలో ఉన్నది దైవమే కనుక, సర్వధర్మాలు పరమేశ్వరునే ఆశ్రయించుకొని ఉన్నాయి. ధర్మము ధర్మికన్నా వేరుగా ఉండలేదు. సృష్టి లోని ధర్మాలను వీక్షించినపుడు మన బుద్ధిలో ధర్మి లేక పరమేశ్వరుడు ప్రకాశిస్తాడు. అలాగే పరమేశ్వరుడు అవతరించినపుడు, ధర్మియైన ఆ దివ్యాత్ముని ప్రతి కదలికలో ధర్మమే. గోచరిస్తుంది. శ్రీరాముడు అవతరించాడు. ధర్మమును తాను స్వయంగా ఆచరించి చూపాడు (ధర్మం కరోతి). ఇతరులు ఆచరించడానికి ఆదర్శమయ్యాడు (ధర్మం కారయతి), ఇదంతా అవతార కార్యంలో దివ్యంగా సాగే ధర్మసంస్థాపనము.

సవరించడమా? సంస్కరించడమా?

ధర్మ సంస్థాపనము అంటే, ధర్మమును సవరించడము అని కూడా కొందరు భావిస్తారు. ఇది చాలా

తప్పు. దేశకాలాదులలో నిరుపయోగంగా మారిన ధర్మాన్ని కాలానుగుణంగా సవరించి, స్థాపించడము ధర్మసంస్థాపనము అని వారి అభిమతం. ఇలాంటి మహత్తరమైన కార్యమును సామాన్యులు చేయలేరు కనుక, భగవంతుడే స్వయంగా అవతరించి ఆ కార్యాన్ని పూర్తి చేస్తాడని వారి విశ్వాసము.

ఇలాంటి వ్యాఖ్యానాలు శాస్త్ర హృదయం తెలియని వారికి వినసొంపుగానే ఉంటాయి. ఈ విధమైన

దోషపూరిత వ్యాఖ్యలు ఎంత అయోమయాన్ని సృష్టిస్తాయో శాస్త్రవిదులకే తెలుసు.

ధర్మాన్ని సవరించడానికి దైవం అవతరించడమే వాస్తవ మైతే, మరి, అవతారమూర్తి సవరించే ధర్మాన్ని సృష్టించిం దెవరు? భగవంతుడే కదా! మరి ధర్మాన్ని సృష్టించిన దైవానికి (ధర్మకృత్), లేదా ధర్మరూపంలో ఉన్న దైవానికి ధర్మం విషయంలో పూర్ణజ్ఞాన ముందా, లేదా? పూర్ణపురుషుడు, పురుషోత్తముడు ఏర్పరచిన ధర్మానికి కాలదోషం పడుతుందా? పడితేనే కదా సవరించాలి? సవరించడానికి అవతరించిన భగవంతుడు, ధర్మమును సృష్టించిన భగవంతుని కన్నా వేరైన వాడా? వేరైతే వీరిరువురిలో భగవంతు దెవరు? ఒక్కరే అయితే, పూర్ణ జ్ఞానమున్నవాడు కాలదోషం పట్టే ధర్మాన్ని సృష్టిస్తాడా ? ధర్మానికి కాలదోషం పడితే, ధర్మరూపంలో ఉన్న దైవానికి

కూడా కాలదోషం పట్టినట్లే కదా? అలాంటి భగవంతుడు ఒకవేళ నేడు అవతరించి ధర్మాన్ని సవరిస్తే, అదే ధర్మము భవిష్యత్తులో నిరుపయోగం కాదని చెప్పగలమా? భవిష్యత్తు అంటే ఏమిటి? తరువాత క్షణము కూడా భవిష్యత్తు క్రిందికే వస్తుంది కదా! ఇలా ఏ క్షణమైనా క్షీణించే ధర్మాన్ని సవరించడానికి భగవంతుడు అవతరించవలసిన అవసరం ఉందా? కొద్దిగా ఆలోచించ గలిగితే ఈ సవరణవాదులు సంస్కరింప బడుతారు.

సవరింప బడటానికి ధర్మ మనేది రాజ్యాంగము కాదు. పరిమిత జ్ఞానము కలవారు సృష్టించింది.

కాదు. త్రికాల జ్ఞావము లేనివారు తయారు చేసింది కనుక, రాజ్యాంగము కాలానుగుణంగా అనేక సవరణలతో నూతన రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానము పూర్ణజ్ఞానము కనుక అది సవరణలకు వీలు కాదు. కనుక ధర్మ సంస్థాపనము అంటే, నిరుపయోగ మైన ధర్మాన్ని రాజ్యాంగాన్ని సవరించినట్లు సవరించడం కాదు. ధర్మాన్ని ఉపయోగించుకోలేని సమాజాన్ని ధర్మాన్ని ఆచరించేలాగా సంస్కరించడమే. కనక ధర్మసంస్థాపనము అంటే, ప్రజలు ధర్మాన్ని ఆచరించేలా చేయడమే. ఆచరించ వలసింది ధర్మము. ఆచరించ కూడనిది అధర్మము. ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించక పోవడమే గాక,

ఆచరించ కూడని అధర్మాన్ని ఆచరించడం వల్ల సమాజం ధర్మజీవనానికి దూరమౌతుంది. ధర్మానికి దూరమైన సమాజము దగా పడుతుంది. నశించి పోతుంది. ఈ పరిస్థితిని చక్క చేయాలి అంటే సర్వజనులు ధర్మ మార్గంలో చరించేలా చూడాలి. ఈ విధమైన మంగళకార్యాన్ని నిర్వర్తించడానికే భగవంతుడు అవసరాన్ని బట్టి రూపం. ధరించి అవనిపై అవతరిస్తాడు. అవతారమూర్తి స్పూర్తితో అధర్మపరులు కూడా ధర్మమూర్తులై శోభిస్తారు. ఈ పవిత్రమైన కార్యాన్ని నిర్వర్తించడానికే తాను ప్రతి యుగం లోను అవతరిస్తూ ఉంటాను అంటున్నాడు.

(తధర్ధం సంభవామి యుగే యుగే ప్రతియుగమ్).

యుగమంటే కాలం

ప్రతి యుగంలోను తాను అవతరిస్తూ ఉంటాను అన్నాడు భగవంతుడు. అంటే, అవతార మనేది.

కేవలం ఆ యుగంలోనే రావాలి అని లేదు. ఏ యుగంలోనైనా రావచ్చు. అంతేకాదు, ప్రతి యుగంలో

తప్పకుండా రావాలి అని కూడా లేదు. అవసరాన్ని బట్టే అవతారము. మనం నిర్మించుకున్న గృహం పాడైతే మనం బాగు చేసుకుంటాము. ఎప్పుడు బాగు చేసుకుంటాము? ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు బాగు చేసుకుంటాము. ఇదీ అంతే.

సమాజానికి సరియైన ధర్మబోధలు అందుతున్నంత కాలం ప్రజలు ధర్మాన్ని అనుష్టిస్తూనే ఉంటారు. ధర్మాచార్యులు, సాధుపురుషులు సన్మార్గాన్ని నిర్దేశిస్తున్నంత కాలం ధర్మజీవనాన్ని జనులు కొనసాగిస్తూనే ఉంటారు. బోధలు అందక పోయినా, లేదా దుర్బోధలు బోధల రూపంలో వ్యాప్తి చెందినా ప్రమాదం వాటిల్లుతుంది. సమాజం ధర్మం విషయంలో సందిగ్ధంలో పడి పోతుంది. ఇలాగే చాలా కాలం కొనసాగితే సమాజం ధర్మం విషయంలో నిర్వీర్యమై నిస్సార మవుతుంది. ఇదే ధర్మగ్లాని. ఇలా భయంకరంగా, చీభత్సంగా తయారైన సమాజాన్ని మరల ధర్మవృక్ష ఛాయలో నిలిపేందుకు మాధవుడు మానవుడై అవతరించి, అనితర సాధ్యంగా ధర్మ సంస్థాపనము గావిస్తాడు.

త్రాణం అంటే రక్షణము. సాధురక్షణము అనే మొదటి ప్రయోజనములో 'త్రాణాయ' అంటే సరిపోతుంది. కాని, 'పరిత్రాణాయ' అన్నాడు భగవంతుడు. 'పరి' అనే ఉపసర్గతో పలికి ఏ ఒక్కరినో కాకుండా అందరినీ రక్షించడం అంతటా రక్షణ నెలకొల్పడం జరుగుతుందని సూచించారు (పరితః త్రాణమ్). నాశః అంటే నాశము. దుష్ట శిక్షణము అనే రెండవ ప్రయోజనములో 'నాశాయ' అంటే సరిపోతుంది. కాని, భగవంతుడు 'వినాశాయ' అన్నాడు. నాశము అంటే నశించడం అని అర్థము. వినాశము అంటే సమూలంగా, కారణ సహితంగా నశించడము అనే అర్థాన్ని సూచిస్తూ 'వినాశాయ' అన్నాడు. స్థాపనము అంటే స్థాపించడం. ధర్మ సంస్థాపనము అనే మూడవ ప్రయోజనములో 'స్థాపనార్థాయ' అంటే సరిపోతుంది. కాని 'సంస్థాపనార్థాయ' అన్నాడు భగవంతుడు, 'సం' అంటే సమ్యక్ అని అర్థం. అంటే, బాగుగా, చక్కగా అని భావము, అనంతుడు అవతారమెత్తినపుడు ధర్మం పూర్ణంగా స్థాపింప బడుతుంది అనే అర్థాన్ని సూచిస్తూ 'సంస్థాపనార్థాయ' అన్నాడు.



ఆఖ్యాయిక 

పూర్వం ఒక రాజు గారికి భగవంతుడు అవతరించడం అనే విషయం అస్సలు నచ్చేది కాదు. భగవంతుదేమిటి, అవతరించడం ఏమిటి? విశ్వంలో ధర్మాన్ని చక్కబెట్టాలి అనుకుంటే, ఆయనే దిగిరావాలా? రాజ్య పరిపాలనలో తనకే ఎందరో సహకరించి తన ఆజ్ఞలను పాటిస్తూ, పరిపాలనా వ్యవహారాలను చక్కబెడుతున్నప్పుడు, ఈ విశ్వ యంత్రాంగంలో పరమేశ్వరుని ఆజ్ఞలను పాటించే వారే లేరా? అని వితండంగా వాదిస్తూ ఉండేవాడు. ఆయన వాదన ఎవ్వరికీ నచ్చక పోయినా, ప్రభువు కావడం చేత ఎవ్వరూ ప్రతివాదం. చేసేవారు కారు.

మంత్రిగారు మంచి భక్తుడు. నైష్ఠికుడు. శాస్త్ర పాండిత్యం కలవాడు. రాజుగారి వైఖరి తనకు నచ్చక

పోయినా, తనలో తాను మధన పడేవాడే గాని రాజు గారిని వారించే వాడు కాదు.

సాయంత్రాలలో గంగానదిలో నౌకా విహారం చేయడం రాజుగారికి సరదా. మంత్రి గారిని, కొందరు

పండితులను నావలో ఎక్కించుకొని శాస్త్ర చర్చ చేస్తూ విహరించడం అలవాటు.

ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి నదిలో నౌకా విహారం చేస్తూ ఉన్నారు. శాస్త్ర చర్చ జరుగుతూ

ఉంది. ఇంతలో ఆ నౌక లోనే తమతో పాటు విహరిస్తున్న రాజుగారి ఐదేళ్ళ కుమారుడు పట్టు తప్పి నదిలో పడి పోయాడు.

అయ్యో, అయ్యో! బాబు పడిపోయాడు! అంటూ మంత్రి బిగ్గరగా అరిచాడు. అంతే, వెంటనే రాజుగారు నది లోకి దూకి, మునిగి పోతున్న కుమారుణ్ణి ఎత్తుకొని, ఈదుకుంటూ వచ్చి నావ నెక్కాడు. తీరా చూస్తే, రాజుగారి చేతిలో ఉన్నది పిల్లవాని ప్రతిమ మాత్రమే! పిల్లవాడు కాదు. రాజకుమారుడు మంత్రిగారి వెనుక కూర్చుని కనిపించాడు. విషయం అర్థం గాక, రాజు నివ్వెర పోయాడు.

ప్రభూ! క్షమించండి. మీ బిడ్డ ఇక్కడే మా వద్ద క్షేమంగా ఉన్నాడు. నదిలో పిల్లవాడి బొమ్మను మీరు

చూడకుండా పడేసింది మేమే. మీ బిడ్డ నదిలో పడిపోయాడు అనగానే మీరే ఎందుకు నది లోకి దూకారు? నది లోకి దిగి మీ బిడ్డని కాపాడటానికి ఇంత మంది నావలో ఉన్నా, మీరే ఎందుకు రంగం లోకి దిగారు? మమ్మల్ని ఆజ్ఞాపించ వచ్చు కదా! ఆలోచించండి.

మీ బిడ్డపై ఉన్న ప్రేమ చేత ముందు వెనుక చూడకుండా మీరే ఎలా నది లోకి దూకారో, తన 

బిడ్డలైన భక్తుల మీద ఉండే ప్రేమ వల్ల భగవంతుడు కూడా తానే స్వయంగా అవతరిస్తాడు అని వినయంగా పలికి మంత్రి తల దించుకున్నాడు. రాజు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడు. భగవంతుని అవతారానికి హేతువు ప్రేమే అని గ్రహించాడు.

భగవంతుని అవతార వైభవము, అవతారము సాధించే ప్రయోజనాలు తెలిశాయి. వీటిని తెలియడం వల్ల మన కేమి ప్రయోజనం? చెబుతున్నాడు.తదుపరి శ్లోకంలో .. 


No comments:

Post a Comment

పరిత్రాణాయ సాధూనాం

  పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ | ధర్మ సంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే || 11 || భావము : సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శి...