bhaktiswaranjali
Sunday, 12 October 2025
మౌనమూ శబ్దమూ!
Thursday, 9 October 2025
భగవద్గీత సారాంశము
పరమాత్మనేనమః
శ్రీ గురుధ్యానము:
భగవద్గీత సారాంశము
వ్యర్థంగా ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? ఎవరు నిన్ను చంపగలరు? ఆత్మకు చావులేదు, పుట్టుకాలేదు జరిగిన దానిగురించి బాధ, జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ, అంతా మన మంచికే. జరగబోయే దాని గురించి ఆతృతావద్దు. జరుగుతున్న వర్తమానం మీద శ్రద్ధ వహించు. నీదేమి పోయిందని దుఃఖిస్తున్నావు? వెంట ఏమి తెచ్చావని నీవు పోగట్టుకున్నానని బాధ
పడడానికి ? నువ్వేం ఉత్పత్తి చేసావు, అది నాశనమైందని చింతించడానికి ? నువ్వేమీ వెంట తీసుకుని రాలేదు. సంపాదించిందేదో ఇక్కడే సంపాదించావు ఇవ్వడం కూడా ఇక్కడి వారికే ఇచ్చావు అంతేకాదు, తీసుకున్నది కూడా,
పరమాత్మ దగ్గర నుంచే తీసుకున్నావు. ఇవ్వడం కూడా, పరమాత్మకే ఇచ్చావు. ఖాళీ చేతులతో, వచ్చావు, తిరిగి ఖాళీ చేతులతోనే వెళ్తావు. ఈ రోజు నీదనకుంటున్నది, నిన్న వేరొకరిది, మొన్న ఇంకెవరిదో. దీనిని నీదనుకుని మురిసి పోతున్నావు. ఈ ఆనందమే, నీ దుఃఖాలకు మూలం. మార్పు జీవన సిద్ధాంతం. నీవు మృత్యువని భావిస్తున్నావే, నిజానికి అది జీవితం. ఒక్క క్షణంలో నీవు కోటిశ్వరుడవు కాగలవు, మరుక్షణంలో దరిద్రుడవూ కాగలవు. నాది. నీది, చిన్న, పెద్ద, స్వపర వంటి భేద భావాల్ని తొలగించుకో, అప్పుడు అన్నీ నీవిగా, అందరూ నీవారుగా, నీవు అందరికీ చెందిన వ్యక్తిగా భావించుకో గలుగుతావు.
ఈ శరీరం నీది కాదు, నువ్వీ శరీరానికి చెందిన మనిషివీ కాదు. ఈ శరీరం అగ్ని, నీరు, గాలి, మట్టి, ఆకాశం - వీటితో తయారైంది. తిరిగి వాటిలోనే ఐక్యమైపోతుంది. కాని, ఆత్మ శాశ్వతమైనది,
మరి నీ వెవరు ?
నిన్ను నీవు పరమాత్మకు అర్పితం చేసుకో. ఇదే నీకు సర్వోత్తమమైన ఆధారం. ఇది తెలిసినవారికి భయము, చింత, దుఃఖము కలుగవు..
నీవు చేసే ప్రతి పనినీ ఈశ్వరార్పితం చెయ్యి. ఇలా చేయడం వలన నీకు సదా జీవన్ముక్తికి సంబంధించిన అనందం కలుగుతుంది.
(కృష్ణం వందే జగద్గురుమ్)
Wednesday, 1 October 2025
పరిత్రాణాయ సాధూనాం
అవ్యక్తం వ్యక్తం
అవ్యక్తంగా అనంతుడైన భగవంతుడు వ్యక్తం కావడమే అవతారము. భగవంతుని అవతారములో అనంతమైన కారుణ్యమే ప్రధానంగా గోచరిస్తుంది. ఒక్క విషయాన్ని అర్థం చేసుకుందాం. మన శరీరంలో భగవంతుడు లేని దెక్కడ? అలాగని అన్ని చోట్ల ధ్యానించ గలమా? హృదయంలోనే ధ్యానిస్తాం. ధ్యానానికి హృదయం ఉపలబ్ధి స్థానం. హృదయంలో ధ్యానం సాగుతుంది. హృదయం లోనే దైవదర్శన మవుతుంది. అంతమాత్రాన పరమేశ్వరుడు దేహంలో హృదయానికే పరిమితం అని భావించ గలమా? అంతే. దేహమంతా నియతి రూపంలో శోభిస్తున్న పరమేశ్వరుని, హృదయంలో ధ్యానించిన వారికి హృదయంలో దర్శన మిస్తాడు. అదే ఆయన కారుణ్యం.
విశ్వంలో ఈశ్వరుడు లేని దెక్కడ? విశ్వమంతా తానే నిండి నిబిడీకృతమై ఉన్నాడు. బ్రహ్మ ఏవ ఇదం విశ్వం. ఈ విశ్వమంతా బ్రహ్మమే. వివిధ ప్రత్యయ గమ్యంగా రూప శబ్దాదులతో విశ్వం గోచరిస్తూ ఉంటే, దేనికీ దూరం కాకుండా, దేనికీ అంటకుండా అభిన్న నిమిత్త ఉపాదాన కారణమైన భగవంతుడు విశ్వానికి విలక్షణంగా శోభిస్తున్నాడు. అలాంటి దివ్యాత్ముడ్ని కళ్ళు దర్శించ గలవా? దర్శించ లేవు. కనుక, బుద్ధితో చూడాలి. అవ్యక్తు డైన పరమాత్మ జ్ఞానరూపంలో బుద్ధికి అందుతాడు. తానే వ్యక్త మైతే కళ్ళకు కూడా కనిపిస్తాడు.
ధర్మ రూపంలో అవ్యక్తంగా శోభించు వాడు, దివ్యదేహధారిగా వ్యక్తమై ప్రకాశించడమే అవతారము.
ఎవరు అవతరించినా, ఏది అవతరించినా వచ్చిన పనిని చక్క పెట్టుకొని వెళ్ళేందుకేనని ఇంతకుముందే తెలుసుకున్నాం. మరి, భగవంతుడు అవతరించి నపుడు ఏయే కార్యాలు జరుగుతాయి? ఏయే ప్రయోజనాలు సిద్ధిస్తాయి?
పని ఒక్కటే ఫలితాలు మూడు
భగవంతుడు అవతరించడం అనే ఒక్క అద్భుత కార్యానికి మూడు ప్రయోజనాలు దివ్యంగా సిద్ధిస్తాయి.
అవి (1) సాధు పరిరక్షణము (2) పాప వినాశము (3) ధర్మ సంస్థాపనము.
అవతారము అందించే ఫలితాలు మూడుగా తెలుస్తున్నా, ఈ మూడింటిలో ఏ ఒక్కటి సిద్దించినా, మిగిలిన రెండూ సిద్దించినట్లే. ఈ సత్యాన్ని చివర అర్థం చేసుకుంటాం. ముందుగా ప్రయోజన క్రమాన్ని వంట పట్టించుకుందాం.
(1) సాధు పరిరక్షణము
సాధుః అంటే మంచివాడు (సజ్జనః) సన్మార్గములో చరించే వాడు సాధువు, లేదా సజ్జనుడు. అలాంటి వారిని పరిరక్షించడం అవతార ప్రయోజనాలలో మొదటిది. సన్మార్గంలో చరించేవారు సాధువులు కనుక, అలాంటి సాధువులను పరిరక్షించడమే సాధు పరిరక్షణము (సాధూనాం సన్మార్గస్థానం. పరిత్రాణాయ పరిరక్షణాయ)
సన్మార్గంలో ప్రవర్తించే వాళ్ళు సాధువులు, అయితే ఏది సన్మార్గము? ఎవరి మార్గము వారికి సన్మార్గముగానే కనిపిస్తుంది. లేకపోతే, ఇన్ని మతాలు ఎలా పుట్టుకొచ్చాయి? సన్మార్గము అంటే ధర్మమార్గము. ఏది ధర్మమార్గము? ఒకొక్క కాలానికి ఒకొక్క ధర్మము, ఒకొక్క దేశానికి ఒకొక్క ధర్మము, ధర్మనిర్ణయం ఇదమిత్థంగా తేలే విషయ మేనా? ఇదంతా వ్యావహారిక ధర్మము, ఇక్కడ ధర్మము అంటే, న్యాయము లేదా నియతి అని అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో నియతి ఉంది. అదే ఇక్కడ ధర్మం. ధర్మరూపంలో ఉన్నది దైవమే. ధర్మమార్గంలో ప్రవర్తించడము అంటే దైవమార్గంలో సయనించడ మని అర్థము. నియతిని అనుసరిస్తూ జీవించేవాడు సాధువు (న్యాయవర్తీ సాధు ). కనుక సాధువులు అంటే సన్యాసులు అని కాదు. ధర్మజీవనం సాగించే వారు అని అర్థము. సన్యాసులు ధర్మజీవనాన్ని సాగిస్తారు. కాని, ధర్మజీవనంలో ప్రయాణం చేసే వాళ్ళందరూ సన్యాసులు కానవసరం లేదు.
మరి, న్యాయవర్తులైన సాధుజనులు ధర్మమార్గాన చరిస్తూనే ఉంటారు కదా! అలాంటి వారిని పరిరక్షించవలసిన అవసరం ఏమిటి? వారికి మార్గంలో రక్షణ కరువై ఉండాలి. భద్రత లోపించి ఉండాలి. సాధువుల అభద్రతకు ఎవరు కారణమై ఉంటారు? సాధువులకు అభద్రతను, అవరోధాలను కలిగించేవారు అసాధువులై ఉండాలి. పాపాత్ములై ఉండాలి. సాధువులను పరిరక్షించే పవిత్రకార్యంలో పాపులను నిర్మూలించ వలసిన అవసరం ఉంది కనుక, ఇది అవతార వైభవంలో ప్రాప్తించే రెండవ ప్రయోజనము, దుష్కృతులైన పాపాత్ములయొక్క (పాపకారిణాం) వినాశము (వినాశాయ) అవతారము యొక్క రెండవ కార్యము..
పాప వినాశము
పాపకార్యాలు ఆచరించే వాళ్ళను నశింప చేయడమంటే పాపాన్ని నశింప చేయడమని అర్థము. నశింపబడేది పాపికాదు. పాపము. సాధు పరిరక్షణము ఎంత అవసరమో, పాపి వినాశము కూడా అంతే అవసరము. ధర్మమార్గంలో అవరోధంగా మారిన పాపులను తొలగించక పోతే, సాధుజీవనము ముందుకు సాగదు. సాధుజీవనం కుంటుపడితే, సమాజం కుదుట పడదు. సమాజ అభ్యుదయం సాధుజీవనంపై ఆధారపడి ఉంది కనుక, సాధుజీవనానికి ఆటంకంగా తయారైన పాపుల్ని ఏరి వేయాలి. తీసి దూరంగా పారేయాలి.
దేహంలో ఒక అవయవం కుళ్ళిపోతే, ఆ దుష్టాంగాన్ని వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగిస్తారు. అలా చేస్తేనే, వ్యక్తి బ్రతుకుతాడు, ఒకవేళ దుష్టాంగాన్ని తొలగించకుండా, అలాగే ఉంచితే దేహమంతా కుళ్ళిపోయే ప్రమాదం, తద్వారా మరణ ప్రాప్తి కలుగ వచ్చు. కనుకనే, వైద్యుడు దుష్టాంగాన్ని నిర్మూలించినట్లు, నారాయణుడు వైద్యుని పాత్రను పోషించి, సమాజం లోని పాపాన్ని నిర్మూలించి అభ్యుదయాన్ని ఆరోగ్యప్రదంగా ఉంచుతాడు. అట్టి సమాజంలో ధర్మం శోభిస్తుంది. ధర్మజీవనం దివ్యంగా ప్రకాశిస్తుంది.
ధర్మ సంస్థాపనము
ధర్మమును చక్కగా స్థాపించడమే ధర్మ సంస్థాపనము (ధర్మస్య సమ్యక్ స్థాపనం), ధర్మమును స్థాపించడము అంటే ధర్మమును స్థిరీకరింప చేయడము లేదా రక్షించడము అని అర్థము. ధర్మమును రక్షించడము అంటే, ధర్మమును ఆచరించే ధర్మాత్ములను రక్షించడము అని భావము. ధర్మాత్ములను రక్షించడము అంటే, ధర్మాత్ముల ధర్మజీవనాన్ని ఆటంకపరచే అధర్మపరులను శిక్షించడమని అర్థము. అధర్మపరులే పాపులు. వారు ధర్మమును అనుష్టించరు. పైగా అధర్మములో చరిస్తారు. వారు అధర్మములో చరించడమే గాక ధర్మమార్గాన చరించే వారికి అవరోధంగా తయారవుతారు. కనుకనే ధర్మ సంస్థాపనము అనే పవిత్ర కార్యంలో శిష్ట రక్షణముతో పాటు దుష్టశిక్షణము కూడా జరుగుతుంది. ఇదంతా అవతార కార్యము.
ధర్మరూపంలో ఉన్నది దైవమే కనుక, సర్వధర్మాలు పరమేశ్వరునే ఆశ్రయించుకొని ఉన్నాయి. ధర్మము ధర్మికన్నా వేరుగా ఉండలేదు. సృష్టి లోని ధర్మాలను వీక్షించినపుడు మన బుద్ధిలో ధర్మి లేక పరమేశ్వరుడు ప్రకాశిస్తాడు. అలాగే పరమేశ్వరుడు అవతరించినపుడు, ధర్మియైన ఆ దివ్యాత్ముని ప్రతి కదలికలో ధర్మమే. గోచరిస్తుంది. శ్రీరాముడు అవతరించాడు. ధర్మమును తాను స్వయంగా ఆచరించి చూపాడు (ధర్మం కరోతి). ఇతరులు ఆచరించడానికి ఆదర్శమయ్యాడు (ధర్మం కారయతి), ఇదంతా అవతార కార్యంలో దివ్యంగా సాగే ధర్మసంస్థాపనము.
సవరించడమా? సంస్కరించడమా?
ధర్మ సంస్థాపనము అంటే, ధర్మమును సవరించడము అని కూడా కొందరు భావిస్తారు. ఇది చాలా తప్పు. దేశకాలాదులలో నిరుపయోగంగా మారిన ధర్మాన్ని కాలానుగుణంగా సవరించి, స్థాపించడము ధర్మసంస్థాపనము అని వారి అభిమతం. ఇలాంటి మహత్తరమైన కార్యమును సామాన్యులు చేయలేరు కనుక, భగవంతుడే స్వయంగా అవతరించి ఆ కార్యాన్ని పూర్తి చేస్తాడని వారి విశ్వాసము.
ఇలాంటి వ్యాఖ్యానాలు శాస్త్ర హృదయం తెలియని వారికి వినసొంపుగానే ఉంటాయి. ఈ విధమైన దోషపూరిత వ్యాఖ్యలు ఎంత అయోమయాన్ని సృష్టిస్తాయో శాస్త్రవిదులకే తెలుసు. ధర్మాన్ని సవరించడానికి దైవం అవతరించడమే వాస్తవ మైతే, మరి, అవతారమూర్తి సవరించే ధర్మాన్ని సృష్టించిం దెవరు? భగవంతుడే కదా! మరి ధర్మాన్ని సృష్టించిన దైవానికి (ధర్మకృత్), లేదా ధర్మరూపంలో ఉన్న దైవానికి ధర్మం విషయంలో పూర్ణజ్ఞాన ముందా, లేదా? పూర్ణపురుషుడు, పురుషోత్తముడు ఏర్పరచిన ధర్మానికి కాలదోషం పడుతుందా? పడితేనే కదా సవరించాలి? సవరించడానికి అవతరించిన భగవంతుడు, ధర్మమును సృష్టించిన భగవంతుని కన్నా వేరైన వాడా? వేరైతే వీరిరువురిలో భగవంతు దెవరు? ఒక్కరే అయితే, పూర్ణ జ్ఞానమున్నవాడు కాలదోషం పట్టే ధర్మాన్ని సృష్టిస్తాడా ? ధర్మానికి కాలదోషం పడితే, ధర్మరూపంలో ఉన్న దైవానికి
కూడా కాలదోషం పట్టినట్లే కదా? అలాంటి భగవంతుడు ఒకవేళ నేడు అవతరించి ధర్మాన్ని సవరిస్తే, అదే ధర్మము భవిష్యత్తులో నిరుపయోగం కాదని చెప్పగలమా? భవిష్యత్తు అంటే ఏమిటి? తరువాత క్షణము కూడా భవిష్యత్తు క్రిందికే వస్తుంది కదా! ఇలా ఏ క్షణమైనా క్షీణించే ధర్మాన్ని సవరించడానికి భగవంతుడు అవతరించవలసిన అవసరం ఉందా? కొద్దిగా ఆలోచించ గలిగితే ఈ సవరణవాదులు సంస్కరింప బడుతారు.
సవరింప బడటానికి ధర్మ మనేది రాజ్యాంగము కాదు. పరిమిత జ్ఞానము కలవారు సృష్టించింది కాదు. త్రికాల జ్ఞావము లేనివారు తయారు చేసింది కనుక, రాజ్యాంగము కాలానుగుణంగా అనేక సవరణలతో నూతన రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానము పూర్ణజ్ఞానము కనుక అది సవరణలకు వీలు కాదు. కనుక ధర్మ సంస్థాపనము అంటే, నిరుపయోగ మైన ధర్మాన్ని రాజ్యాంగాన్ని సవరించినట్లు సవరించడం కాదు. ధర్మాన్ని ఉపయోగించుకోలేని సమాజాన్ని ధర్మాన్ని ఆచరించేలాగా సంస్కరించడమే. కనక ధర్మసంస్థాపనము అంటే, ప్రజలు ధర్మాన్ని ఆచరించేలా చేయడమే. ఆచరించ వలసింది ధర్మము. ఆచరించ కూడనిది అధర్మము. ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించక పోవడమే గాక, ఆచరించ కూడని అధర్మాన్ని ఆచరించడం వల్ల సమాజం ధర్మజీవనానికి దూరమౌతుంది. ధర్మానికి దూరమైన సమాజము దగా పడుతుంది. నశించి పోతుంది. ఈ పరిస్థితిని చక్క చేయాలి అంటే సర్వజనులు ధర్మ మార్గంలో చరించేలా చూడాలి. ఈ విధమైన మంగళకార్యాన్ని నిర్వర్తించడానికే భగవంతుడు అవసరాన్ని బట్టి రూపం. ధరించి అవనిపై అవతరిస్తాడు. అవతారమూర్తి స్పూర్తితో అధర్మపరులు కూడా ధర్మమూర్తులై శోభిస్తారు. ఈ పవిత్రమైన కార్యాన్ని నిర్వర్తించడానికే తాను ప్రతి యుగం లోను అవతరిస్తూ ఉంటాను అంటున్నాడు.
(తధర్ధం సంభవామి యుగే యుగే ప్రతియుగమ్). యుగమంటే కాలం
ప్రతి యుగంలోను తాను అవతరిస్తూ ఉంటాను అన్నాడు భగవంతుడు. అంటే, అవతార మనేది. కేవలం ఆ యుగంలోనే రావాలి అని లేదు. ఏ యుగంలోనైనా రావచ్చు. అంతేకాదు, ప్రతి యుగంలో తప్పకుండా రావాలి అని కూడా లేదు. అవసరాన్ని బట్టే అవతారము. మనం నిర్మించుకున్న గృహం పాడైతే మనం బాగు చేసుకుంటాము. ఎప్పుడు బాగు చేసుకుంటాము? ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు బాగు చేసుకుంటాము. ఇదీ అంతే.
సమాజానికి సరియైన ధర్మబోధలు అందుతున్నంత కాలం ప్రజలు ధర్మాన్ని అనుష్టిస్తూనే ఉంటారు. ధర్మాచార్యులు, సాధుపురుషులు సన్మార్గాన్ని నిర్దేశిస్తున్నంత కాలం ధర్మజీవనాన్ని జనులు కొనసాగిస్తూనే ఉంటారు. బోధలు అందక పోయినా, లేదా దుర్బోధలు బోధల రూపంలో వ్యాప్తి చెందినా ప్రమాదం వాటిల్లుతుంది. సమాజం ధర్మం విషయంలో సందిగ్ధంలో పడి పోతుంది. ఇలాగే చాలా కాలం కొనసాగితే సమాజం ధర్మం విషయంలో నిర్వీర్యమై నిస్సార మవుతుంది. ఇదే ధర్మగ్లాని. ఇలా భయంకరంగా, చీభత్సంగా తయారైన సమాజాన్ని మరల ధర్మవృక్ష ఛాయలో నిలిపేందుకు మాధవుడు మానవుడై అవతరించి, అనితర సాధ్యంగా ధర్మ సంస్థాపనము గావిస్తాడు.
త్రాణం అంటే రక్షణము. సాధురక్షణము అనే మొదటి ప్రయోజనములో 'త్రాణాయ' అంటే సరిపోతుంది. కాని, 'పరిత్రాణాయ' అన్నాడు భగవంతుడు. 'పరి' అనే ఉపసర్గతో పలికి ఏ ఒక్కరినో కాకుండా అందరినీ రక్షించడం అంతటా రక్షణ నెలకొల్పడం జరుగుతుందని సూచించారు (పరితః త్రాణమ్). నాశః అంటే నాశము. దుష్ట శిక్షణము అనే రెండవ ప్రయోజనములో 'నాశాయ' అంటే సరిపోతుంది. కాని, భగవంతుడు 'వినాశాయ' అన్నాడు. నాశము అంటే నశించడం అని అర్థము. వినాశము అంటే సమూలంగా, కారణ సహితంగా నశించడము అనే అర్థాన్ని సూచిస్తూ 'వినాశాయ' అన్నాడు. స్థాపనము అంటే స్థాపించడం. ధర్మ సంస్థాపనము అనే మూడవ ప్రయోజనములో 'స్థాపనార్థాయ' అంటే సరిపోతుంది. కాని 'సంస్థాపనార్థాయ' అన్నాడు భగవంతుడు, 'సం' అంటే సమ్యక్ అని అర్థం. అంటే, బాగుగా, చక్కగా అని భావము, అనంతుడు అవతారమెత్తినపుడు ధర్మం పూర్ణంగా స్థాపింప బడుతుంది అనే అర్థాన్ని సూచిస్తూ 'సంస్థాపనార్థాయ' అన్నాడు.
ఆఖ్యాయిక
పూర్వం ఒక రాజు గారికి భగవంతుడు అవతరించడం అనే విషయం అస్సలు నచ్చేది కాదు. భగవంతుదేమిటి, అవతరించడం ఏమిటి? విశ్వంలో ధర్మాన్ని చక్కబెట్టాలి అనుకుంటే, ఆయనే దిగిరావాలా? రాజ్య పరిపాలనలో తనకే ఎందరో సహకరించి తన ఆజ్ఞలను పాటిస్తూ, పరిపాలనా వ్యవహారాలను చక్కబెడుతున్నప్పుడు, ఈ విశ్వ యంత్రాంగంలో పరమేశ్వరుని ఆజ్ఞలను పాటించే వారే లేరా? అని వితండంగా వాదిస్తూ ఉండేవాడు. ఆయన వాదన ఎవ్వరికీ నచ్చక పోయినా, ప్రభువు కావడం చేత ఎవ్వరూ ప్రతివాదం. చేసేవారు కారు. మంత్రిగారు మంచి భక్తుడు. నైష్ఠికుడు. శాస్త్ర పాండిత్యం కలవాడు. రాజుగారి వైఖరి తనకు నచ్చకపోయినా, తనలో తాను మధన పడేవాడే గాని రాజు గారిని వారించే వాడు కాదు. సాయంత్రాలలో గంగానదిలో నౌకా విహారం చేయడం రాజుగారికి సరదా. మంత్రి గారిని, కొందరు పండితులను నావలో ఎక్కించుకొని శాస్త్ర చర్చ చేస్తూ విహరించడం అలవాటు. ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి నదిలో నౌకా విహారం చేస్తూ ఉన్నారు. శాస్త్ర చర్చ జరుగుతూ ఉంది. ఇంతలో ఆ నౌక లోనే తమతో పాటు విహరిస్తున్న రాజుగారి ఐదేళ్ళ కుమారుడు పట్టు తప్పి నదిలో పడి పోయాడు.
అయ్యో, అయ్యో! బాబు పడిపోయాడు! అంటూ మంత్రి బిగ్గరగా అరిచాడు. అంతే, వెంటనే రాజుగారు నది లోకి దూకి, మునిగి పోతున్న కుమారుణ్ణి ఎత్తుకొని, ఈదుకుంటూ వచ్చి నావ నెక్కాడు. తీరా చూస్తే, రాజుగారి చేతిలో ఉన్నది పిల్లవాని ప్రతిమ మాత్రమే! పిల్లవాడు కాదు. రాజకుమారుడు మంత్రిగారి వెనుక కూర్చుని కనిపించాడు. విషయం అర్థం గాక, రాజు నివ్వెర పోయాడు. ప్రభూ! క్షమించండి. మీ బిడ్డ ఇక్కడే మా వద్ద క్షేమంగా ఉన్నాడు. నదిలో పిల్లవాడి బొమ్మను మీరు చూడకుండా పడేసింది మేమే. మీ బిడ్డ నదిలో పడిపోయాడు అనగానే మీరే ఎందుకు నది లోకి దూకారు? నది లోకి దిగి మీ బిడ్డని కాపాడటానికి ఇంత మంది నావలో ఉన్నా, మీరే ఎందుకు రంగం లోకి దిగారు? మమ్మల్ని ఆజ్ఞాపించ వచ్చు కదా! ఆలోచించండి.
మీ బిడ్డపై ఉన్న ప్రేమ చేత ముందు వెనుక చూడకుండా మీరే ఎలా నది లోకి దూకారో, తన
బిడ్డలైన భక్తుల మీద ఉండే ప్రేమ వల్ల భగవంతుడు కూడా తానే స్వయంగా అవతరిస్తాడు అని వినయంగా పలికి మంత్రి తల దించుకున్నాడు. రాజు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడు. భగవంతుని అవతారానికి హేతువు ప్రేమే అని గ్రహించాడు.
భగవంతుని అవతార వైభవము, అవతారము సాధించే ప్రయోజనాలు తెలిశాయి. వీటిని తెలియడం వల్ల మన కేమి ప్రయోజనం? చెబుతున్నాడు.తదుపరి శ్లోకంలో ..
Monday, 22 September 2025
అనన్యా శ్చిన్తయన్తో మాం - గీత 9-22 # చైతన్య భగవద్ గీత #రాజవిద్యారాజగుహ్య యోగము
‘అమ్మా! నా పేరు రంగడు. నేను పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటాను. మీ వారు మా శేఠ్ వద్ద ఈ
సరుకులు తీసుకొని, తొందరగా మీకు ఇచ్చి రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. నేను బయలుదేరడంలో కొంత ఆలస్య మైందని ఆగ్రహించి, అక్కడే ఉన్న ముల్లుకర్రతో నన్ను కొట్టారు. ఆ ముల్లు గీసుకుని రక్తం వచ్చింది. అంతే' అన్నాడు ఆ బాలుడు.
'అయ్యో! ఎంత తొందర అయితే మాత్రం పసిబిడ్డను ఇలా కొట్టడమా? ఉండు నాయనా! కాస్త తుడిచి
మందు వేస్తాను' అని ఆమె లోపలి కెళ్ళింది. ఆమె తిరిగి వచ్చే లోగా బాలుడు తిరోహితు డయ్యాడు.
ఇల్లాలు మూటను విప్పి చూచింది. అందులో కుటుంబము లోని వారందరికి బట్ట లున్నాయి. కొన్ని నగలున్నాయి. కొంత నగదు కూడా ఉంది.
సంచులలో చూస్తే వంట సరుకులు పుష్కలంగా ఉన్నాయి. ఆశ్చర్య పోయిన ఆ తల్లి వెంటనే షడ్రసోపేతమైన పాకం చేయడానికి సిద్ధమై చకచకా చేస్తూ ఉంది. ఈ లోగా దీన వదనుడై ఇంటి వైపు వస్తున్న భర్తను చూచి, పరుగు పరుగున ఆయనను సమీపించింది.
ఆమెను చూడగానే భర్త కన్నీళ్ళను ఆపుకోలేక పోయాడు.
'నా ప్రయత్న మంతా నేను చేశాను. ఎవరిని అడిగినా, ఎంతగా ప్రాధేయ పడినా, ఎవ్వరూ కనికరించ
లేదు. ఆకలితో అలమటిస్తున్న బిడ్డలకు కనీసం గంజైనా త్రాగించ లేని నా దారిద్ర్యానికి సిగ్గు పడుతున్నాను' అని ఆ భక్తుడు పసిబిడ్డలా రోదించాడు.
భార్య విస్మయం చెందింది. 'అదేమిటి! మీరు పంపిన సరుకులతో నేను వంట కూడా చేస్తూ ఉంటే,
మీరేమిటి అలా మాట్లాడుతారు?' అని ప్రశ్నించింది. 'నేను సరుకులు పంపడమేమిటి?' అని తిరిగి ప్రశ్నించాడు భర్త.
జరిగిన విషయ మంతా ఆమె పూస గుచ్చినట్లు చెప్పింది. బాలుడి వీపుపై ముల్లుగీత వల్ల ఏర్పడిన
గాయాన్ని గూర్చి కూడా చెప్పింది. భక్తుడు నిర్ఘాంత పోయాడు. తీరా వెళ్ళి పూజా మందిరంలో చూస్తే, తాళపత్రంపై ముల్లుగీత లేదు. చిరుగు అసలే లేదు. గ్రంథము మామూలుగా ఉంది.
తన తప్పిదానికి భక్తుడు పరితపించాడు. తీవ్రమైన ఉద్విగ్నతకు లోనయ్యాడు. పాండురంగని దివ్య
దర్శనానికి నోచుకున్న అర్ధాంగి అదృష్టానికి పరవశించి పోయాడు.
'భగవాన్! పాండురంగా! నా అజ్ఞానాన్ని క్షమించు. నీ మాట ఎన్నడూ వృథా కాదు. నీ భక్తుడు ఎప్పుడూ వృథా పోడు. గీతపై ముల్లుతో గీస్తే అది నీ దేహంపై గీసినట్లు అయిందా? నాకు కనువిప్పు కలగడానికి నా చేత నువ్వే అలా చేయించావా? నీ గీతా వాక్యం సత్యం కాదని అనుమానించాను. కాని, గీత నీ దేహమేనని, నీ స్వరూపమే నని గ్రహించలేక పోయాను' అని పశ్చాత్తాపం చెంది, పరమేశ్వరుడు అనుగ్రహించిన నగలను, నగదును పేదలకు పంచిపెట్టి, రెట్టించిన భక్తి శ్రద్ధలతో ఆ భక్తుడు అనన్య భక్త్యారాధనకు పునరంకిత మయ్యాడు.
గీతాశ్రయో_హం తిష్ఠామి గీతామే చోత్తమం గృహమ్ |
గీతా జ్ఞాన ముపాశ్రిత్య త్రీన్లోకా న్పాలయా మ్యహమ్ ||
నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీతయే నాకు వాస మందిరము. గీతా జ్ఞానమును ఆధారం
చేసుకొని నేను ముల్లోకాలను పాలిస్తున్నాను అని వరాహ పురాణంలో భగవానుడు భూదేవికి బోధించాడు.
అనన్య భక్తి అనేది అనేక జన్మల పుణ్యఫల విశేషం. నిరంతరాభ్యాసం వల్ల ప్రాప్తించే భగవదనుగ్రహం. అనన్య భక్తి తత్పరులైన ఏకాంత భక్తుల హృదయాలలో పరమేశ్వరుడు తప్ప మరొకటి ఉండే అవకాశం లేదు. వాళ్ళు కేవలం భగవచ్ఛరణులు. కనుక వారి యోగక్షేమాలను పరమేశ్వరుడే చూసుకుంటాడు. (కేవల మేవ భవచ్చరణాః తే అతః భగవా నేవ తేషాం యోగక్షేమం వహతి ఇతి).
అనన్య భక్తిలో రమించే ఏకాంత భక్తులు భగవంతుని కన్నా అన్యమైన సమస్త విషయాలలో ఉపేక్షా
భావాన్ని కలిగి ఉంటారు. చివరికి బ్రతుకులో గాని, చావులో గాని చెక్కు చెదరని, మొక్కవోని భక్తితోనే
శోభిస్తూ ఉంటారు. (న హి తే జీవితే మరణేవా ఆత్మనః గర్దిం కుర్వన్తి!). పరమేశ్వరుని క్షణం విడిచి జీవించ లేరు. బ్రతుకులో ఏదైనా జరగనీ, బుద్ధిలో భక్తిని మాత్రమే ప్రధానంగా ఉంచుకుంటారు. క్షణక్షణానికి పెంచు కుంటారు.
పల్లవి: నీవు లేక నేను లేను - లేను నిన్ను విడిచి నేను ఉండలేను ॥నీవు ||
చరణము:బ్రతుకు బండలైనా బుద్ధి పండి ఉంది మాధవ మాధవ యనుచు మథన పడుతూ ఉంది
కొన ఊపిరైనా తూలుతూ నీ పాదము చేరు ॥ నీవు ||
అని చైతన్య గీతిక అనన్య భక్తి రాగాన్ని ఆలపించింది.
ఇంతవరకు మనం భక్తి ప్రధానమైన కర్మయోగానుసారము ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పుకున్నాం.
ఇప్పుడు జ్ఞానపరంగా చూద్దాం.
అనన్య చింతనము
అనన్యులు అంటే అన్యంగా ఉండని వారు. పరమాత్మ కన్నా తాము వేరు అని భావించని వారు
అనన్య చేతస్కులు (అనన్యాః అపృథగ్భావాః) పరమాత్మను ఆత్మ స్వరూపంగా దర్శించి ఉపాసించే వారు అని అర్థము. అట్టి వారి యొక్క యోగక్షేమాలను పరమాత్మే వహిస్తాడు. జ్ఞాని పరమాత్మ కన్నా అన్యంగా లేదు కనుక, జ్ఞాని యోగక్షేమాలను స్వయంగా పరమాత్మే చూసుకుంటాడు.
జ్ఞానీ త్వాశైవ మే మతమ్ - 'జ్ఞాని నా ఆత్మయే' అని ఏడవ అధ్యాయం - పద్దెనిమిదవ శ్లోకంలో
భగవంతుడే చెప్పి ఉన్నాడు కదా! అందుచేత జ్ఞాని యొక్క అవసరాలు పరమాత్మ అవసరాలుగా మారుతాయి. కనుక జ్ఞాని యోగక్షేమాలను పరమాత్మే వహిస్తాడు.
అయితే, ఈ సందర్భములో శ్రీ శంకరాచార్య స్వామి భాష్యంలో ఒక ఆసక్తికర మైన విషయాన్ని
వినిపిస్తారు. నను అన్యేషా మపి భక్తానాం యోగక్షేమం వహత్యేవ భగవాన్? మరి, జ్ఞానులు కాని భక్తుల యొక్క అనగా కర్మయోగుల యొక్క యోగక్షేమాలను కూడా భగవంతుడు వహిస్తాడు కదా! నిజమే. అది సత్యం. తప్పక వహిస్తాడు (సత్యం ఏవమ్; వహతి). మరి భక్తుల యోగక్షేమాలను కూడా తానే వహించే టప్పుడు, తన స్వరూపమైన జ్ఞానుల యోగక్షేమాలను చూసుకుంటాడు అని ప్రత్యేకించి చెప్పడంలో విశేష మేమిటి? అనేది శంక. విశేష ముంది. అదేమిటంటే,
అన్య యే భక్తాః తే స్వాత్మార్థం స్వయమపి యోగక్షేమం ఈహస్తే అనన్య దర్శినః తు న ఆత్మార్ధం యోగక్షేమం ఈహన్తో- భక్తులు తమ యోగక్షేమాలకై తాము ప్రయత్నం చేసుకుంటూనే, పరమేశ్వరుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అనన్య దర్శులైన జ్ఞానులు తమ యోగక్షేమాలను తాము పట్టించుకోరు. అంతటా ఉపేక్షా భావంతో ఉంటారు. ఇదే ఇద్దరి మధ్య భేదము. ఈ శ్లోక వ్యాఖ్యానంలో మనం చెప్పుకున్న పండరీ భక్తుడు కూడా భార్య సలహా మేరకు ఊళ్ళో కెళ్ళి తన ప్రయత్న మేదో తాను చేశాడు కదా! అదే జ్ఞాని అయితే చేయడు. పూర్ణ విశ్వాసంతో పరమేశ్వరుని యందే బుద్ధిని నిలిపి ఉంచుతాడు. అదే విశేషము.
శివో భూత్వా శివం భజేత్ - శివుడవై శివుణ్ణి ఆరాధించు అన్నట్లుగా, జ్ఞానులు తమ ఆత్మే పరమాత్మ
అనే బ్రహ్మాత్మ జ్ఞానంతో పరమాత్మను ఉపాసిస్తూ ఉంటారు కనుక, వారి యోగక్షేమాలను పరమాత్మే వహిస్తూ ఉంటాడు.
అన్యమైన విషయాల నుండి దూరంగా పోవాలని ప్రయత్నించే వారు కర్మయోగులు, లేదా భక్తులు. తమలో అన్యమైన విషయాలే లేకుండా చేసుకొనే వారు జ్ఞానులు.
Friday, 1 August 2025
నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807
Wednesday, 30 July 2025
Condolence meeting of Hon'ble MLA Late Maganti Gopinath was held at Veterinery colony, shaikpet, filmnagar
Monday, 21 July 2025
మేలుకో తెలంగాణోడా! - సల్వాజి మాధవరావు - 90525 63147
మౌనమూ శబ్దమూ!
మౌనమూ శబ్దమూ! మీ శబ్దాలన్ని మౌనాలౌతాయి కాల గమనం వాటిని మింగేస్తుంది మీ శబ్దాలన్ని శూన్యాలౌతాయి ఆత్మరహిత ప్రతిధ్వనులై మిగిలిపోతాయి మా మౌ...
-
నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807 తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. 19...
-
మానవాభ్యున్నతికి సహృదయత కావాలి. సదస్సులు కావు. భారతీయ హృదయం పాశ్చాత్య మేధస్సును స్పృశించాలి. అప్పుడే యుద్ధాలు అదృశ్యమవుతాయి. శాంతి నెలకొంటుం...
-
I have updated(26-04-2012)the folder: except MBK – 75 Raga Vaibhavam – Vol 04.part2.rar this link is not working presently if anyone has the...