Saturday, 20 December 2025

నాకేం మేలు జరిగిందో కాదు

ఈ తాత్కాలికమైన జీవితంలో
మనిషి అనేవాడు
తనను తాను
నిరూపించుకునే ఆరాటంలో
ఇతరులను తక్కువ చేస్తూ ఉంటాడు
అహం అతని కవచమవుతుంది
ద్వేషం అతని ఆయుధమవుతుంది
కానీ అవే
తన ఆత్మను నెమ్మదిగా
చీల్చి వేస్తున్నాయని
అతనికి అర్థం కాదు!
ఎందుకు జన్మించాడో తెలియదు
ఎవరికి ఉపయోగపడాలో అనేది మరిచి
వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా
నిత్యం దాన్ని దిగజార్చుకుంటూ
ఎవరి మీద గెలవాలో
ఆలోచిస్తూ ఉంటాడు!
చివరికి
ఈ శ్వాస కూడా అద్దెదే అని
ఈ దేహం కూడా ప్రయాణికుడే అని
అర్థమయ్యేసరికి
కాలం తన ఖాతా మూసేస్తుంది!
మనిషిగా పుట్టడం యాదృచ్ఛికం
కానీ మనిషిగా జీవించడం మాత్రం
మన చేతుల్లోనే ఉన్న భాధ్యత!
- Kallem Naveen Reddy

Wednesday, 17 December 2025

మనల్ని చాలామంది చాలా సింపుల్‌గా అనుకుంటారు లెక్కలోకి కూడా తీసుకోవడానికి వాళ్ళ వ్యక్తిత్వం సరిపోదు#- Kallem Naveen Reddy

 మనల్ని చాలామంది

చాలా సింపుల్‌గా అనుకుంటారు

లెక్కలోకి కూడా తీసుకోవడానికి

వాళ్ళ వ్యక్తిత్వం సరిపోదు

అది మన బలాన్ని
అంచనా వేయలేని
వాళ్ల పరిమితి మాత్రమే!
మనం ఎంత దూరం వెళ్లామో
ఎన్ని అగ్నిగుండాలు దాటామో
ఎంత గొప్ప ప్రయాణం చేశామో
వాళ్ల కళ్లకు కనిపించిన
కనిపించనట్టు ఉంటారు
సింపుల్‌గా ఉండటమనేది
మన బలహీనత కాదు
అది మన లోతు
మన స్థాయి...!
నిశ్శబ్దంగా ఉండటం
మన అలవాటు
శబ్దం చేయకుండా
చరిత్ర రాయడం మన స్వభావం
ఎక్కడికెళ్లినా నేల వాసన మర్చిపోం
గెలిచినా వినయం విడిచిపోం
ఓడిపోయిన కుంగిపోం
ఇంకా బలంగా కొట్లాడుతాం!
మన ప్రయాణం మనకే తెలుసు
మన విలువ కాలానికే తెలుస్తుంది
మనం మాత్రం ఎప్పటిలాగే
సింపుల్‌గానే ముందుకు సాగుదాం!
- Kallem Naveen Reddy


Monday, 15 December 2025

నేను మాత్రమే కాదు

 

నేను మాత్రమే కాదు నాలాంటి వాళ్ళెందరో బీఆర్ఎస్

అనే కుటుంబాన్ని నమ్ముకుని బతుకే అర్పించినవాళ్లం

మీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం

మాలాంటి వాళ్ళను ఆగం చేయకండి!

చేతుల్లో జెండా పట్టుకున్నాం

గుండెల్లో తెలంగాణను నిలుపుకున్నాం

అవమానాలు ఎదురైనా

వెనుదిరగని వాళ్ళం

రాత్రులు మాకెన్నో నిద్రలేకుండా గడిచాయి

ఇళ్లలోకాదు ఆశల అగ్నిలోనే మేము పెరిగాం

బీఆర్ఎస్ కూలిపోతుందంటూ

కలలు కంటున్నవాళ్లకు

ఒక్కటే సమాధానం

త్యాగాల చరిత్రకు

పతనం ఉండదు!

మా పార్టీ ఓ భవనం కాదు

కూల్చడానికి

అది ఓ భావజాలం

చెరిపేయడానికి వీలుకాదు

ప్రతి కార్యకర్త గుండెల్లో

ఒక ఉద్యమం బతుకుతోంది

ఆ ఉద్యమాన్ని

నాశనం చేయాలని కోరుకోవడమే

వాళ్ల జీవితంలో నెరవేరని

అతిపెద్ద పగటి కల!

తెలంగాణ శ్వాస ఉన్నంతవరకు

బీఆర్ఎస్ స్ఫూర్తి ఆగదు

పోరాటం ఆగదు

చరిత్ర ముందుకు నడుస్తూనే ఉంటుంది!

ఎందుకంటే

త్యాగాల మీద నిలిచిన పార్టీని

కక్షలతో కూల్చలేరు

ప్రజల గుండెల్లో నాటుకున్న వృక్షాన్ని

విషపు మాటలతో ఎండబెట్టలేరు!

- Kallem Naveen Reddy

'సిట్' పేరిట దాడి సిగ్గుచేటు - కళ్ళెం నవీన్ రెడ్డి - 9963691692

  'సిట్' పేరిట దాడి సిగ్గుచేటు కళ్ళెం నవీన్ రెడ్డి - 9963691692 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి  ముఖ్యమంత్రి కేసీఆర్కు ...